44 గ్రామ పంచాయతీలు.. 5,394 దరఖాస్తులు
గ్రామసభల్లో అధికారులకు అందిన అర్జీలు
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల అమలు కోసం మంగళవారం జిల్లాలోని 44 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో మొత్తంగా 5,394 దరఖాస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు అందాయి. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామసభలు నిరసనలు.. నిలదీతల మధ్య కొనసాగాయి.
ప్రత్యేక కౌంటర్లు
గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు, రైతు భరోసా దరఖాస్తులను విడివిడిగా స్వీకరించేందుకు నాలుగు ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఏ పథకం కావాలో ఆ కౌంటర్ వద్దకు వెళ్లి దరఖాస్తులను చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లను అందజేసి రిజిస్టర్‌లో బాధితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు..
రేషన్‌కార్డులపైనే..
పోలీసుల బందోబస్తు మధ్య
కొనసాగిన వైనం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించగా జీవింతరావుపల్లి గ్రామసభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలనలో భాగంగా గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వీకరించిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, మండల పంచాయతీ అధికారి రహీం, కార్యదర్శి దామోదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment