కొల్లాపూర్‌ చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌ చైర్‌పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం

Published Wed, Apr 17 2024 1:30 AM

అవిశ్వాస ఓటింగ్‌కు హాజరైన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు   - Sakshi

కొల్లాపూర్‌: బీఆర్‌ఎస్‌కు చెందిన కొల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మంగళవారం పట్టణంలోని నూతన గ్రంథాలయ భవనంలో అవిశ్వాసంపై ఓటింగ్‌ నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారిగా కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను వ్యవహరించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించగా.. ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు కాలేదు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌ విజయలక్ష్మిపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ చదివి, సభ్యులను ఓటింగ్‌ కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు, ఎమ్మెల్సీ చెయ్యి ఎత్తి అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో రెండింట మూడొంతుల మెజార్టీ ప్రకారం అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. త్వరలోనే నూతన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కౌన్సిలర్లందరిని చైర్‌పర్సన్‌ కలుపుకొని పోయి ఉంటే బాగుండేదని.. అలా చేయకపోవడం వల్లే కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందన్నారు. స్థానిక ఎమ్మె ల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు త్వరలోనే కొత్త చైర్‌పర్సన్‌ ఎన్నిక ఉంటుందని తెలిపారు.

చైర్‌పర్సన్‌ ఎన్నిక,

అవిశ్వాసంలోనూ ఎమ్మెల్సీ ఓటు..

మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో, జూపల్లి కృష్ణారావు మద్దతుదారులు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరఫున పోటీచేసి 11 స్థానాల్లో గెలిచారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటర్లుగా పాల్గొన్నారు. వారి ఓట్లతో బీఆర్‌ఎస్‌కు చెందిన రఘుప్రోలు విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, మహిమూదాబేగం వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిమూదాబేగం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చైర్‌పర్సన్‌ విజయలక్ష్మికి పదవి కట్టబెట్టడం, దిగిపోవడం రెండింటిలోనూ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఓటు వేయడం విశేషం.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

పదవి కోల్పోయిన విజయలక్ష్మి

అవిశ్వాస ఓటింగ్‌కు హాజరైన

ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

గైర్హాజరైన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

Advertisement
Advertisement