భూసేకరణ ప్రక్రియ వేగవంతం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు – రంగారెడ్డి, మార్కండేయ, అచ్చంపేట, కర్నెతండా, డిండి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో రెవెన్యూ, నీటిపారుదలశాఖ, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల వారీగా భూసేకరణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా సేకరించాల్సిన 25247.13 ఎకరాలకు గాను 21613.87 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు. మిగతా 3633.26 ఎకరాల భూమిని త్వరితగతిన సేకరించాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే 167కు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో కేఎల్‌ఐ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, ఆర్డీఓలు సురేష్, మాధవి, శ్రీను తదితరులు ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment