పోటీ పరీక్షలపై అవగాహన అవసరం
తాడూరు: విద్యార్థులు పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. తాడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ బయోసైన్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లాస్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో రాణించేందుకు ఇలాంటి పోటీ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తద్వారా తమలో దాగి ఉన్న నైపుణ్యానికి గుర్తింపు వస్తుందన్నారు. ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో అన్నిరకాల పోటీ పరీక్షలకు మంచి అనుభవంగా ఉపయోగపడతాయని అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కాగా, ఇంగ్లిష్ మీడియం విభాగంలో ఎ.వెంకటేష్ (జిల్లా పరిషత్ గాంధీ స్మారకోన్నత పాఠశాల, కొల్లాపూర్) పి.ఇందు (కేజీబీవీ పెద్దకొత్తపల్లి) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. తెలుగు మీడియం విభాగంలో బి.నిహారిక (జెడ్పీహెచ్‌ఎస్ పోల్కంపల్లి), కె.వెంకటేష్ (జెడ్పీహెచ్‌ఎస్ ఆవంచ) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి డీఈఓ చేతుల మీదుగా మెమోంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ నెల 28న రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్షలకు హాజరవుతారని బయోసైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, హెచ్‌ఎం అనిల్ కుమార్, త్యాగరాజు గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment