మరో అవకాశం
●
అర్హులు దరఖాస్తు
చేసుకోవచ్చు..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సర్వే ప్రక్రియ 15నుంచి 20రోజుల్లో పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 36శాతం సుమారుగా 65వేల దరఖాస్తుదారుల వివరాలను మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేశాం. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేని వారు సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రస్తుతం ప్రజాపాలన వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడంతో మ్యానువల్‌గా స్వీకరించి భద్రపరుస్తాం. వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అనుమతిస్తే దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్ చేస్తాం.
– విజయ్‌కుమార్,
పీఆర్ డీఈ, నోడల్ అధికారి
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం రక్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులై.. వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపాలిటీల్లోని ప్రత్యేక ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నిర్ణయంపై అర్హులైన వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
ఇళ్ల కోసం 2,33,124 దరఖాస్తులు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి.. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, చేయూతతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా 2,33,124 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఈ నెల 9 నుంచి తమ పరిధిలోని దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈనెలాఖరు వరకు సర్వే పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొదటి విడతగా 14వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. తొలివిడత సొంత స్థలం ఉన్న లబ్ధిదారులను ఇళ్లకు ఎంపిక చేసి.. రూ. 5లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.
ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ..
సొంతింటికి స్థలం కలిగి, ఇల్లు లేని నిరుపేదలు అర్హులు. అయితే గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని పేదలు సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రజాపాలన కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రజాపాలన వెబ్‌సైట్ అందుబాటులో లేదు. మ్యానువల్‌గా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తుకు చాన్స్
మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరణ
నాలుగు దశల్లో బిల్లు..
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపడుతున్నారు. సర్వేలో భాగంగా దరఖాస్తుదారుడు ఉంటున్న ఇల్లు ఫొటోతో పాటు ఇల్లు నిర్మించుకునే ఖాళీ స్థలం ఫొటోలు తీసి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఖాళీ స్థలానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. లబ్ధిదారులకు నాలుగు దశల్లో రూ. 5లక్షల బిల్లు చెల్లిస్తారు. బేస్‌మెంట్ లెవల్‌లో రూ.లక్ష, కప్పు లెవల్‌లో మరో రూ.లక్ష, కప్పు పడిన తర్వాత రూ. 2లక్షలు, ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత మిగతా రూ.లక్ష చెల్లిస్తారు. ఇదివరకు ఇంటి నిర్మాణం చేపట్టి, దరఖాస్తు చేసిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం కుదరదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment