సమ్మెబాటలో పంచాయతీ కార్మికులు
అచ్చంపేట రూరల్: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా.. ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంభిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
నెలల తరబడి వేతనాలు పెండింగ్..
జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, వాటర్ మేన్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ.9,500 వేతనంగా నిర్ణయించినా.. నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. గత ఆరునెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారే తప్ప ప్రతినెలా జీతాలు మా త్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వచ్చేనెలలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు
ఆరు నెలలుగా వేతనాలు అందక అవస్థలు
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
డిమాండ్లు ఇవే..
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
2వ పీఆర్‌సీ పరిధిలోకి తీసుకువచ్చి.. జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలను కేటగిరీ ప్రకారం చెల్లించాలి.
జీఓ నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి.
కారోబార్లు, బిల్ కలెక్టర్‌లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి.
అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి.
పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ. 5లక్షల చొప్పున చెల్లించాలి.
మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయంతో పాటు ప్లాట్లు ఇవ్వాలి.
ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment