ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరం
ఉప్పునుంతల/తెలకపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుంటే జీవితం ఆనందమయంగా సాగుతుందని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. సోమవారం ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు తెలకపల్లి మండల కేంద్రం, రాకొండ గ్రామంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిపల్లి చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన ధనుర్మాస మహోత్సవంలో జీయర్ స్వామి పాల్గొని మాట్లాడారు. పురాతన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామాల్లో దేవాలయాలను నిర్మించుకోవడం ద్వారా మనిషిలో దైవచింతనతో పాటు మంచితనం పెరుగుతుందని చెప్పారు. తద్వారా ఎలాంటి ద్వేషాలు లేకుండా కలసిమెలిసి జీవించగలుగుతారని అన్నారు. తెలకపల్లిలో తిరుపావై గోదాదేవి కథను భక్తులకు వివరించారు. కార్యక్రమాల్లో మామిళ్లపల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజల్‌రావు, నర్సింహారావు, నాయకులు మోహన్‌గౌడ్, మారో జు ఉమాపతి ఆచార్యులు, మాజీ ఎంపీటీసీ మొగిలి నిరంజన్, చంద్రశేఖర్, తుకారం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment