‘నకిలీ’లపై విచారణ
సాక్షి, నాగర్‌కర్నూల్/మన్ననూర్: జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. బోగస్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, నకిలీ స్థానికత సర్టిఫికెట్లు చూపించి కొందరు వ్యక్తులు అటవీశాఖ, పోలీస్‌శాఖ, ఏఈఈ, డీఎస్సీ ఉద్యోగాల్లో చేరినట్టు వచ్చిన ఫిర్యాదులపై గత డిసెంబర్ 23న ‘అక్రమంగా ఉద్యోగాలు’ శీర్షికన ‘సాక్షి’ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు గురువారం అధికారులు విచారణ చేపట్టారు. మన్ననూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సర్టిఫికెట్లను రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధికారిణి నీల నేతృత్వంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, డీటీడీఓ ఫిరంగి, పదర తహసీల్దార్ సురేష్ బాబు, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్‌తో కూడిన అధికారుల బృందం పునఃపరిశీలించింది. నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలు పొందుపరిచి అటవీశాఖలో ముగ్గురు, పోలీస్ శాఖలో ఒకరు, విద్యాశాఖలో మరొకరితో కలిపి మొత్తం 10 మంది వరకు అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి.. ఏటీడీఏ పీఓ చాంబర్‌లో ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించారు. ఉద్యోగం పొందిన సమయంలో సమర్పించిన ధ్రువపత్రాలు నిజమైనవేనా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, విచారణ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న మీడియాను అనుమతించలేదు. విచారణ పకడ్బందీగా కొనసాగుతోందని.. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ రోహిత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment