నాణ్యమైన భోజనం అందించాలి
కందనూలు/వెల్దండ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ ఎ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో వంటగది, డార్మెంటరీ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అదే విధంగా వెల్దండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. మోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సూచించారు. అక్కడి నుంచి కేజీబీవీ, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి.. వంట సామగ్రి, కూరగాయలు, స్టోర్ గదులను పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రణాళికా బద్ధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఇన్‌చార్జి ఎంఈఓ చంద్రుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, హెచ్‌ఎం సుగుణ ఉన్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించండి..
తెలంగాణ ఓపెన్ స్కూల్ (టాస్)లో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 9నుంచి 22వ తేదీలోగా పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈఓ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ. 25తో 29వ తేదీ వరకు, రూ. 50 రుసుముతో ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివకుమార్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment