ఈ ఫొటోలోని రైతు పేరు కె.శివప్ప. హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన ఇతను టంకర రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నంబర్ 36లో అర ఎకరం భూమిని 14 ఏళ్ల క్రితం సాదా కాగితంపై కొనుగోలు చేశాడు. గత ప్రభుత్వం సాదాబైనామా కింద యాజమాన్య హక్కులు కల్పించేలా క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో 2020 జూన్‌లో మీసేవ సెంటర్లో దరఖాస్తు చేసుకున్నాడు.
పలు కారణాలతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ధరణి స్థానంలో నూతనంగా భూభారతి పోర్టల్‌ను, ఆర్వోఆర్–24 చట్టం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించిన నేపథ్యంలో తన సమస్య పరిష్కారమవుతుందని ఆ రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ వివరాలు పారదర్శకం, సమస్యల పరిష్కారానికి సులువైన మార్గమంటూ గత ప్రభుత్వం 2019లో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూముల క్రయవిక్రయాలతో పాటు రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా ఆ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు భూ సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన రైతాంగానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. చాలా గ్రామాల్లో భూ సమస్యలకు పరిష్కారం దొరక్క గొడవలు చెలరేగాయి. పలువురు కేసుల్లో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మండల తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో భూసమస్యలు, వివాదాలపైనే ఎక్కువగా ఉండడం గమనార్హం.
జఠిలంగా మారిన సమస్యలు..
డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకంలో కాస్తు కాలం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పలు కుటుంబాల మధ్య జగడాలు చోటుచేసుకున్నాయి. పట్టాదారుకు సర్వహక్కులు కల్పించడం.. ఎవరి ప్రమేయం లేకుండా భూముల క్రయవిక్రయాలకు ఆస్కారం కల్పించడంతో వివాదాలు తలెత్తి ఉమ్మడి కుటుంబాల్లో చిచ్చు రాజేశాయి. సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ నుంచి మొదలు జిల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కకపోవడంతో బాధిత రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. గ్రామాల్లో పెద్ద మనుషుల మధ్య తాత్కాలిక ఒప్పందాలు జరిగినా.. సమస్యలు మరింత జఠిలంగా మారాయి.
సాదాబైనామా దరఖాస్తులు 25,218..
సాదా కాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉంటూ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం కలిగించేందుకు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 జూన్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 25,218 దరఖాస్తులు వచ్చాయి. కాస్తులో ఉన్నప్పటికీ భూమి అమ్మిన వారి సమ్మతి తీసుకోవాలనే నిబంధన, అమ్మిన వారి పేరున భూమి లేకపోవడం వంటి సమస్యలతో పాటు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వాటి క్రమబద్ధీకరణకు అడుగులు ముందుకుపడలేదు. తాజాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ఇబ్బందులు, సాదాబైనామాల క్రమబద్ధీకరణలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా భూభారతి పోర్టల్, ఆర్వోఆర్–2024 చట్టం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నూతన ఆర్వోఆర్ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి.
మరో 9,263 అర్జీలు పెండింగ్..
ధరణిలో 33 రకాల మాడ్యూళ్లు ఉన్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకంలో పేర్లు సరిచేయడం, మ్యుటేషన్, నాలా, మిస్సింగ్ సర్వే నంబర్ వంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు అవకాశముంది. అయితే కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడం, పరిష్కారం కేవలం కలెక్టర్ లాగిన్‌లో ఉండడంతో ఎనలేని జాప్యం చోటుచేసుకోవడం దరఖాస్తుదారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అదేవిధంగా పీపీబీ (పట్టాదారు పాసుబుక్కు)లో డేటా కరెక్షన్ కోసం వందలాదిగా దరఖాస్తులు వచ్చినా.. చేసే వీలు ధరణి పోర్టల్‌లో లేకపోయింది. ఇలాంటి సమస్యలకు సంబంధించి రెవెన్యూ అధికారుల వద్ద సుమారు 9,263 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతి చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే..
భూభారతి పోర్టల్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గ దర్శకాలు రాలేదు. చట్టంగా మారింది. నియమనిబంధనలు రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విధివిధానాల ఆధారంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉంది. ధరణి పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది రెగ్యులర్ ప్రక్రియనే. – మోహన్‌రావు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment