ప్రయాణం.. ప్రమాదం!
జాగ్రత్తలతోనే నియంత్రణ..
వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఎక్కువ. 18 ఏళ్లు నిండిన వారు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వాహనాలు నడపాలి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దు. భారీ వాహన డ్రైవర్లు ఎక్కువ గంటలు వాహనాలను నడపడంతో అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రమాదాలు జరుగుతాయి. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించొద్దు.
స్వచ్ఛందంగా మార్పురావాలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాహనదారుల్లో స్వచ్ఛందంగా మార్పు వస్తేనే ప్రమాదాలను అరికట్టవచ్చు. అతివేగంతో వాహనాలు నడిపి మృతిచెందితే కుటుంబ సభ్యులకు కలిగే వేదనను ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – చిన్న బాలు,
జిల్లా రవాణాశాఖ అధికారి, నాగర్‌కర్నూల్
జిల్లాలో కొనసాగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాలు
● పోలీసు, రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
● రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా..
●
నాగర్‌కర్నూల్ క్రైం: మితిమీరిన వేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారినపడి కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు పలువురు వాహనదారులు. రహదారి నిబంధనలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహన చోదకులు కొద్దిరోజులు మాత్రమే పాటిస్తూ మళ్లీ యథావిథిగా మారుతున్నారు. ఏ విషయంలోనైనా చట్టాలు కఠినంగా అమలు చేస్తే వచ్చే ఫలితాల కన్నా.. ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు వస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రవాణా, పోలీసుశాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 31 వరకు మాసోత్సవాలు నిర్వహించి రహదారి నిబంధనలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లా పరిధిలో గడిచిన మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు మృత్యువాత పడగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతోనే అధిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2024లో 385 రోడ్డు ప్రమాదాలు జరిగితే 184 మంది మృతిచెందగా 420 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2023లో 367 రోడ్డు ప్రమాదాలు జరగగా 191 మంది మృతిచెందగా 394 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో ఈ నెల 31 వరకు పోలీసు, రవాణాశాఖ సంయుక్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఆటో, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment