ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎస్సీల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. మంగళవారం కమిషన్ చైర్మన్ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులాలు, సంఘాలు, నాయకులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని స్వయంగా వినతులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు, ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు, స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన, అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా గాని, సంఘాలు గాని ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ వినతులు సమర్పించాలని కోరారు. కోర్టు జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకొని వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. ఇది వరకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తయ్యిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్‌లో నేరుగా కమిషన్‌కు అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు.
సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం
రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్
160 దరఖాస్తుల స్వీకరణ
కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో 160 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు అందించారు. అంతకు ముందు మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్ విజయేందిర కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికారు. కమిషన్ విచారణ అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని 11 వార్డు పాత పాలమూరు ఎస్సీ వాడలో పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో మాట్లాడి.. వారి స్థితిగతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment