గృహజ్యోతి కొందరికే!
నల్లగొండ, నల్లగొండ టూటౌన్: గృహజ్యోతి పథకం అర్హులైన వారిరందరికీ అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాటినా పథకం కింద అర్హులకు ఉచిత విద్యుత్ వర్తింపజేయడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వాడుకునే వారందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా పాలన కార్యక్రమం కింద దరఖాస్తులు స్వీకరించింది.
సగం మందికే..
జిల్లాలో మొత్తం 4,88,302 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2,05,013 మందికి మాత్రమే ఉచిత విద్యుత్ అర్హత లభించింది. అయితే అద్దె ఇళ్లలో ఉండే వారికి ఓనర్లు సహకరించకపోవడతో మొదటిసారి దరఖాస్తు చేసుకోలేదు. ఇంటి ఓనర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత యజమానులు, కిరాయిదారులు కూడా ఉచిత విద్యుత్‌కు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో దాదాపు లక్షా 7 వేల మందికి అన్ని అర్హతలు ఉండి కూడా గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ అందడం లేదు. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 1,500పైగా దరఖాస్తుదారులు అన్ని అర్హతలు ఉన్నా ఉచిత విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నా వాటిని ఇంకా పరిశీలించడం లేదు.
ఆన్‌లైన్‌లో అన్నీ తప్పులే..
ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఆన్‌లైన్ చేయించింది. ఒక్కో దరఖాస్తు ఫారం ఆన్‌లైన్ చేసినందుకు రూ.15 ఇచ్చింది. ఈ క్రమంలో ఎక్కువ ఫారాలు ఆన్‌లైన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో కంప్యూటర్ ఆపరేటర్లు హడావుడిగా ప్రక్రియను కొనసాగించారు. దీంతో తప్పులు ఎక్కువగా దొర్లాయి. ఇంటి అడ్రస్‌తోపాటు ఆధార్ నంబర్లు, కొంత మందికి అసలు కరెంట్ మీటర్ లేదని కూడా నమోదు చేశారు. కొంత మందివైతే వేరే మండలాల పేర్లు కూడా నమోదు చేశారు. ఇలాంటి కారణాలతో అనేక మందికి గృహజ్యోతి పథకం అందకుండా పోయింది. పథకం అందని వారు మున్సిపల్, ట్రాన్స్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సైట్‌లో కూడా తప్పులు సరిచేసేందుకు ఆప్షన్ ఇచ్చి తమకు కూడా గృహజ్యోతి అందేలా చూడాలని అర్హులైన పేదలు కోరుతున్నారు.
ఉచిత కరెంట్ అందడంలేదు
ప్రజా పాలనలో దరఖాస్తు చేశాను. గృహజ్యోతికి అర్హత కూడా సాధించాను. కానీ కరెంట్ మీటర్ నంబర్ ఆన్‌లైన్ తీసుకోవడంలేదని అధికారులు చెబుతున్నారు. 11 నెలలుగా మున్సిపల్, ట్రాన్స్‌కో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ చేతుల్లో లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఉచిత కరెంట్ అందడం లేదు.
– జి.భగవాన్, గాంధీనగర్, నల్లగొండ
తప్పులను సరిచేయాలి
గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఉచిత కరెంట్ అందకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటి వరకు మాకు గృహజ్యోతి అందడంలేదు. ప్రభుత్వం సైట్ ఓపెన్ చేసి తప్పులు ఉంటే సరిచేయాలి. అర్హులైన పేదలందరికీ ఉచిత కరెంట్ అందించాలి.
– గుండా రమేష్, శ్రీరాంనగర్,
పాగనల్ రోడ్డు, నల్లగొండ
ఫ ఆన్‌లైన్ నమోదులో తప్పులు
ఫ అర్హత కోల్పోయిన వేలాది దరఖాస్తులు
ఫ కార్యాలయాల చుట్టూ పేదల
ప్రదక్షిణలు
ఫ మా చేతుల్లో లేదంటున్న అధికారులు
గృహజ్యోతికి అర్హత
పొందినవి 2.05 లక్షలు
గృహ కనెక్షన్లు
4.88 లక్షలు
పరిశీలించని
కొత్త దరఖాస్తులు 1,00,000
అర్హత ఉండి పథకం వర్తించనివి1.07 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment