నల్లగొండకు మూడు లిఫ్టులు మంజూరు
నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త లిఫ్టులను మంజూరు చేసింది. 4,231 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబోయే వీటి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. 510 ఎకరాలకు సాగు నీరందించేందుకు కనగల్ మండలం పొనుగోడులో నిర్మించే లిఫ్టుకు రూ.6.83 కోట్లు, అలాగే 2,484 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నల్లగొండ మండలం నర్సింగ్‌భట్ల ప్రాంతంలో నిర్మించే లిప్టుకు రూ.16.95 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామ సమీపంలోని బక్కతాయికుంట వద్ద 1,237 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించనున్న లిఫ్టుకు రూ.20.22 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ గురుకులం సందర్శన
కేతేపల్లి: మండలంలోని బొప్పారం శివారులో గల బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి గణేశ్ మంగళవారం పాముకాటుకు గురికావడంతో బుధవారం సాయంంత్ర ఆ పాఠశాలను బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మద్దిలేటి, ఏజీఓ లక్ష్మయ్య సందర్శించారు. సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం పాఠశాల, వసతి గృహంలో సౌకర్యాలను పరిశీలించారు. అంతకు ముందు పాము కాటుకు గురై నకిరేకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి గణేశ్‌ను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్‌సీఓ సంధ్య, పాఠశాల ప్రిన్సిపాల్ ధనమ్మ తదితరులు ఉన్నారు.
హామీలు అమలు చేయాలి
నల్లగొండ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగుకలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వీహెచ్‌పీఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు కోరారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం వికలాంగులకు ఇవ్వాలని, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జరిగే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని వికలాంగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్త వెంకన్నయాదవ్, ఎం.డి.ఫరూక్, సైదులు, శ్రీరామదాసు వెంకటాచారి, అహ్మద్‌ఖాన్, పెరిక శ్రీనివాస్, ముద్దం నర్సింహగౌడ్, ఇందిర, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఒక్కరూ ప్రతిఘటించాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు ఎండీ. మోహినొద్దీన్, కె.నర్సింహారెడ్డి, పాశం నరేష్‌రెడ్డి, సుంకిశాల వెంకన్న, సహదేవ్ పాల్గొన్నారు.
మాదిగలకు హోంమంత్రి పదవి ఇవ్వాలి
నల్లగొండ టౌన్: మాదిగలకు హోంమంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2025 జనవరి 26లోపు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నారపాక అంజి, ఏర్పుల రాకేష్, బొంగరాల రంజిత్, మామిడి రాహుల్, భూతం సాయి కిరణ్, కటికల కళ్యాణ్, కటికల రవీందర్, నవీన్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment