శానిటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
కేతేపల్లి: ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో శానిటేషన్ నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కేతేపల్లి మండలం బొప్పారం శివారులో మూసీ డ్యాం దిగువన గల బీసీ బాలుర గురుకులంలో మంగళవారం ఓ విద్యార్థి పాము కాటుకు గురైన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు, వంట గదులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆవరణలోనే మురుగు నీరు పారడం, పిచ్చి మొక్కలు, చెత్త ఎక్కువగా ఉండడాన్ని గమనించి ప్రిన్సిపాల్ ధనమ్మ, పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయంత్రంలోగా ఆరవణను శుభ్రం చేయాలన్నారు. శిథిల గదులు, మరుగుదొడ్లతోపాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. కొత్తవారి నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేస్తానని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఇనుప సామగ్రిని తొలగించాలని మూసీ ఏఈ మధును ఆదేశించారు. పాఠశాల స్థలానికి హద్దులు నిర్ణయించాలని సూచించారు. పాఠశాలలో పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉన్నా తనకు ఎందుకు నివేదిక పంపించలేదని, విద్యార్థులకు ప్రమాదం జరిగేంత వరకు స్పందించరా అని ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ రాజేంద్రప్రసాద్‌ను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారం రోజుల తర్వాత పాఠశాలను మరోసారి సందర్శిస్తానని, మార్పు రాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆమె వెంట బీసీ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ సంధ్య, తహసీల్దార్ బి.మధుసూధన్‌రెడ్డి, కార్యదర్శి హరీష్ ఉన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
నకిరేకల్: ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నకిరేకల్‌లోని ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆమె సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మూసీ గురుకులంలో పాముకాటుకు గురై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి గణేష్‌ను పరామర్శించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల వైద్యశాల భవనం సముదాయాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట తహసీల్దార్ జమీరుద్దీన్, డాక్టర్లు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment