అభివృద్ధిని ఉరకలెత్తించాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని ఉరకలెత్తించాలి

Published Sat, Nov 23 2024 1:03 AM | Last Updated on Sat, Nov 23 2024 1:03 AM

అభివృ

అభివృద్ధిని ఉరకలెత్తించాలి

నల్లగొండ : ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అన్నదమ్ముల్లా కలిసి పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం కమిటీ చైర్మన్‌, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించేది తెలంగాణ అయితే.. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో అధికంగా వరి పండిస్తున్నారని అందుకు రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పత్తి కొనుగోళ్లలో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. కేంద్రం నుంచి ఏఏ పథకాలకు నిధులు రావాల్సి ఉందో గుర్తించి వాటిని రప్పించే విధంగా ఎంపీలు కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో తీసుకున్న నిర్నయాల వల్ల ఆ శాఖ రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. మా ప్రభుత్వం అందులో రూ.10 వేల కోట్లు అప్పులు తీర్చిందని తెలిపారు.

అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేయాలి..

జిల్లాలో ఆయిల్‌పాం ప్యాక్టరీని ఎప్పుడు పెడుతున్నారని పతంజలి ఇన్‌చార్జిని మంత్రి ప్రశ్నించగా.. సంవత్సరంలో పెడతామని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం పంటలు ఎక్కడ అమ్ముతున్నారని అడగ్గా ఆంధ్రప్రదేశ్‌లోని అంబాపురానికి పంపుతున్నామని చెప్పారు. ‘ఇక్కడ పండించిన పంటను అంబాపురంలో అమ్మడం ఏంటి? వెంటనే పరిశ్రమ ఏర్పాటు చేయండి.. లేదంటే అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేస్తాం’ అని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఇక్కడ ప్యాక్టరీ కడితే రైతులకు విశ్వాసం కలుగుతుందన్నారు. వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభివృద్ధికి ‘దిశ’ కృషి : మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ దిశ కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దిశ కమిటీలు కృషి చేస్తున్నాయన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలపై తమకు అభిప్రాయం తెలియజేస్తే.. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 92 పథకాలు ఉన్నా.. కొన్నింటి ద్వారానే జిల్లాకు నిధులు అందుతున్నాయన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై తయారు చేసిన ప్రాజెక్టును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దిశ కమిటీ సమావేశానికి వచ్చినప్పుడు కాకుండా ముందుగానే నివేదికలు పంపితే తాము మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, వీరేశం, సామేల్‌, బాలునాయక్‌ మాట్లాడుతూ ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం వచ్చిన రోజే కొనాలి

నల్లగొండ రూరల్‌ : సరైన శాతం, నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం వచ్చిన రోజే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి కోమటిరెడ్డితో కలిసి జిల్లా కేంద్రం సమీపంలోని కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు.

ఫ అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదమ్ముల్లా కలిసి పనిచేయాలి

ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వర్‌రావు

ఫ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

ఫ ఎంపీ రఘవీర్‌రెడ్డి అధ్యక్షతన ‘దిశ’ సమావేశం

No comments yet. Be the first to comment!
Add a comment
అభివృద్ధిని ఉరకలెత్తించాలి1
1/1

అభివృద్ధిని ఉరకలెత్తించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement