మరో మూడు సమీకృత గురుకులాలు
నల్లగొండ : ఉమ్మడి జిల్లాకు మరో మూడు సమీకృత గురుకులాలు మంజూరయ్యాయి. నకిరేకల్, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల్లో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. సమీకృత గురుకులాలు రెండో దశలో భాగంగా వీటిని మంజూరు చేసినట్లు ఆయన ఆ ఊత్తర్వుల్లో పేర్కొన్నారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఖాళీగా ఉన్న సబ్జెక్టులను బోధించుటకు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఉపేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకనామిక్స్ 1, జువాలజీ 1 ఖాళీగా ఉన్నాయని.. పీజీలో 55 శాతం మార్కులు, నెట్, సెట్, పీహెచ్‌డీతో పాటు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని.. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 26న ఇంటర్వ్యూలలు నిర్వహిస్తామని తెలిపారు.
మెరుగైన సేవలు అందించాలి
నల్లగొండ రూరల్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ డిపోలో సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నిబద్దతతో విధులు నిర్వహించాలన్నారు. నల్లగొండ రీజియన్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలన్నారు. అంతకు ముందు డిపోలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్‌ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్‌ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు.
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నల్లగొండ రూరల్ : కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 7 డిపోల నుంచి అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి, బీమవరంలో సోమేశ్వర స్వామి, పాలకొల్లులో క్షీరలింగేశ్వర స్వామి, సామర్లకోటలో బీమలింగేశ్వర స్వామి క్షేత్రాలకు బస్‌లు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24న ఆదివారం రాత్రి 8 గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని.. ఒక్క రోజులోనే పంచారామ క్షేత్రాలను దర్సించుకునే అవకాశం ఆర్టీసి కల్పిస్తోందని తెలిపారు. వివరాలకు మిర్యాలగూడ : 08689 241111, నల్లగొండ : 7382834610, సూర్యాపేట హైటెక్ : 949492665, సూర్యాపేట న్యూ : 7382943819, కోదాడ : 7780433533, దేవరకొండ : 8639049226, యాదగిరిగుట్ట : 9885103165 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
24న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు
సూర్యాపేట టౌన్: అండర్–11, 15 ఓపెన్ విభాగాల్లో బాలబాలికలకు ఈ నెల 24న సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గండూరి కృపాకర్, సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతో పాటు షీల్డ్, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లుపేర్కొన్నారు.
ఓపీ బ్లాక్ నిర్మాణానికి రూ.3.60 కోట్లు
హుజూర్‌నగర్: హుజుర్‌నగర్‌లోని ఏరియా ఆసుపత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి రూ.3.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు శుక్రవారం రూ 3.60 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఓపీ బ్లాక్‌తో పాటు పార్కింగ్ షెడ్,ఽ దోభీ ఘాట్, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment