పాలకవర్గాల్లేక పదకొండేళ్లు
ప్రభుత్వం నుంచి
ప్రకటన రావాల్సి ఉంది
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన పనులు సిద్ధం చేశాం. కార్మికుల సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటాం.
–ద్వారక్, చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
నల్లగొండ టూటౌన్: చేనేత సహకార పారిశ్రామిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించక పదకొండేళ్లు దాటింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంత వరకు సంఘాల ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు. జిల్లాలో 33 చేనేత సహకార పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. కార్మికులు నేసిన చీరలు ఈ సంఘాల ద్వారానే ఆప్కోకు విక్రయిస్తుంటారు. సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడంతో నేతన్నల సమస్యలు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాలకు విన్నవించే వారే లేకుండా పోయారని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల హయాంలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనలో..
2013 నుంచి చేనేత సహకార సంఘాలు పర్సన్ ఇన్‌చార్జ్(అధికారుల)ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించకుండా చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. పర్సన్ ఇంచార్జ్‌లుగా ఉన్న అధికారులు చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. చేనేత సహకార సంఘాలకు పాలకవర్గాలు లేకపోవడంతో చేనేత కార్మికులకు రావాల్సిన పలు సబ్సిడీ పథకాల గురించి సైతం చర్చించే అవకాశం లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వాలు
ఫ ఇన్‌చార్జ్‌ల పాలనతో ఇక్కట్లు
ఫ గత ప్రభుత్వంలోనూ ఎన్నికలకు నోచుకోని సంఘాలు
జిల్లాలో 36 చేనేత సంఘాలు
జిల్లాలో 36 చేనేత, మరమగ్గ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో మూడు మరమగ్గాలు కాగా, 33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 100 నుంచి 300 మంది వరకు కార్మికులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనగర్, చర్లపల్లి, మునుగోడు, నకిరేకల్ ప్రాంతాల్లో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో సుమారు ఏడు వేలకు పైగా కార్మికులు ఉన్నారు. చేనేత సహకార సంఘాలకు పాలకవర్గాలకు లేని కారణంగా కార్మికులు నేసే చీరను సరైన సమయంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా కార్మికుల నుంచి సంఘాల ద్వారా ఆప్కో కొనుగోలు చేసిన బట్టకు సైతం సకాలంలో డబ్బులు ఇవ్వకుండా తీవ్ర జాప్యం జరుగుతున్నా పట్టించుకునే వారులేరు. పాలకవర్గాలు ఉంటే సంబంధిత చైర్మన్‌లు, ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కార్మికుల సంక్షేమానికి పాటుపడతారు. కొత్త పథకాలు ప్రవేశ పెట్టాలని కూడా ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో చేనేత కార్మికుల సమస్యలు తీరడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment