అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ: నల్లగొండ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ బాలుర పాఠశాలలో పీజీటీ తెలుగు, ఇంగ్లిష్, బయోసైన్స్, టీజీటీ మ్యాథ్స్(జనరల్ ) పోస్టు, నకిరేకల్ బాలికల పాఠశాలలో టీజీటీ సైన్స్ (మహిళ), నల్లగొండ బాలుర కళాశాలలో స్టాఫ్ నర్స్(జనరల్1), అనుముల హాలియా బాలుర పాఠశాలలో స్టాఫ్ నర్స్(జనరల్1), నల్లగొండ బాలికల పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్(మహిళ) పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. బోధనా నైపుణ్యం, అనుభవం, ఆంగ్ల భాషా పరిజ్ఞానం, డెమో ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నల్లగొండ రూరల్: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు నల్లగొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, సమస్యలు చెప్పేందుకు 99592 26305 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ క్రైం: పోలీస్ గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా విచారించి పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 మంది బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎస్‌ఐలను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందని తెలిపారు.
నేడు బహిరంగ వేలం
కనగల్: దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద పలు వస్తువులు అమ్ముకునే హక్కులను పొందేందుకు మంగళవారం టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జయరామయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
సద్వినియోగం చేసుకోవాలి
చిట్యాల: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలను పొందిన మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మహిళా శక్తి పథకం ద్వారా పాడి గేదెలు మంజూరయ్యారు. ఈమేరకు సోమవారం గ్రామంలో పశువుల షెడ్‌లను ఆయన ప్రారంభించారు. చిట్యాల మండలానికి 26 పాడి గేదేలు మంజూరుకాగా ఇప్పటి వరకు 13 గేదెలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం పద్మ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓ శ్రీలత, ఎంపీఏ సత్యనారాయణ పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
ధనుర్మాసోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు సోమవారం ఉదయం పారాయణీకులు, అర్చక బృందం గోదాదేవికి 8వ పాశురం పఠించారు. ప్రధానార్చకుడు పాశురం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ముఖమండపం ఉత్తరం వైపు హాల్‌లో అమ్మవారిని ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి అలంకరించారు. అర్చకులు పాశురాలు పఠించి హారతినిచ్చారు. మహిళలు మంగళ హారతులతో గోదాదేవికి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment