త్రిశంకు స్వర్గంలోస్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్
● ప్రారంభమై 8 నెలలైనా మొదలుకాని సేవలు ● రూ. కోట్ల విలువైన యంత్రాలున్నా అనుమతులు తెచ్చుకోలేని వైనం ● 120 పడకల ఆసుపత్రిలో ఒక్కటీ కూడా రాలేదు ● రోజుకు ఓపీ 10 నుంచి 15 దాటని వైనం ● గత ప్రభుత్వం నిర్మించిందనే కారణంతో కూటమి ప్రభుత్వం జాప్యం
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ భవనం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు 2017లో అంకురార్పణ జరిగింది. రూ.120 కోట్ల అంచనాతో నిర్మించిన ఈ ఆసుపత్రికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. 2018లో టాటా ట్రస్ట్ వారు వచ్చి స్థలాన్ని పరిశీలించి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి వెళ్లింది. రాష్ట్ర వాటా కింద రూ.36 కోట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో రెండు లీనియర్ యాక్సిలరేటరీలు, ఒక సీటీ సిమ్యులేటర్, ఒక హైడోస్ రేట్ బ్రాకోథెరపీ మిషన్ల ఏర్పాటుకు అవసరమైన నాలుగు బంకర్ల నిర్మాణానికి అప్పట్లో టాటా అటానమిక్ ఎనర్జీ వారు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ప్రస్తుతం హెచ్‌డీఆర్ బ్రాకోథెరపీ మిషన్ మాత్రం రావాల్సి ఉంది. రూ.30కోట్లతో లీనియర్ యాక్సిలరేటరీ, రూ.10కోట్లతో సీటీ స్టిమ్యులేటర్ ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి టాటా అటానమిక్ ఎనర్జీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. 2019 జనవరిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసినా ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కోవిడ్ రావడం, ఇసుక కొరత తదితర కారణాల వల్ల భవన నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇదే క్రమంలో 2022లో క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ ఎండీ పీజీ సీటును నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఆగిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది. ఈ క్రమంలో గత మార్చి నెలలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా పేరెన్నికగన్న ఆసుపత్రి అవుతుందని ప్రారంభ సమయంలో అందరూ భావించారు. ఆ వెంటనే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించి, ప్రారంభించిందనే కారణంతో కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంలో తాత్సారం చేస్తోంది. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కాకపోవడం, వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఇక్కడకు రోగులు సైతం ఓపీకి రావడం లేదు. ఈ మేరకు అధికారులు, వైద్యులు సైతం ధైర్యంగా ఇక్కడ అత్యాధునిక సేవలు అందుతాయన్న భరోసా కల్పించలేకపోతున్నారు. ఇందులో అదనంగా లీనియర్ ఆక్సలరేటర్, ఎక్స్‌టర్నల్ ఆర్‌టీ మిషన్, సీటీ స్కాన్‌లు, పలు రకాల పరికరాలు రావాల్సి ఉంది.
స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు గత ప్రభుత్వం 247 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు గత డిసెంబర్‌లో నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పోస్టులు భర్తీ చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మళ్లీ నోటి ఫికేషన్ ఇవ్వాలన్న ప్రయత్నాలు చేస్తోంది. ఈ కారణంగా ఆయా విభాగాలు, ఇతర ఆసుపత్రుల నుంచి 60 మంది వైద్యులు, సిబ్బంది మాత్రం ఇక్కడకు వచ్చి చేరారు. ప్రస్తుతం ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్టులు, ఒక మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజీలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు పెథాలజిస్టులు, ఇద్దరు సైకియాట్రిస్ట్‌లు ఇక్కడ సేవలందిస్తున్నారు. ప్రీవెంటివ్ ఆంకాలజీ ఓపీ సైతం ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహిస్తున్నారు. కానీ రోగులే ఎవ్వరూ రావడం లేదు.
మంజూరైంది 247...
భర్తీ చేసింది 60 మందిని మాత్రమే
ఓపీకి 10 మంది మాత్రమే రోగులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అక్కసో.. పేదలంటే అలుసో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వైద్య సేవలను విస్మరిస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతోంది. భవనం ఉన్నా అవసరమైన పరికరాలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ప్రైవేటు బాట పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఓపీలో కూర్చుంటున్నా పట్టుమని పది మంది కూడా రోగులు చికిత్స కోసం రావడం లేదు. మంజూరైన పోస్టుల్లో 30 శాతం కూడా పోస్టులు భర్తీ చేయకపోవడం, ఉన్న వారికి పనిలేకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతుంది.
120 పడకల్లో ఒక్కటీ రాలేదు
120 పడకలతో ఏర్పాటైన స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పడక కూడా ఏర్పాటు చేయలేదు. ఈ కారణంగా పాత క్యాన్సర్ విభాగంలోనే అవసరమైన అడ్మిషన్లు చేస్తున్నారు. రోగులకు అవసరమైన ఆపరేషన్లు కూడా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి నెలా 15 మేజర్, 8 మైనర్ క్యాన్సర్ ఆపరేషన్లను వైద్యులు చేస్తున్నారు. క్యాన్సర్ విభాగంలో 8 ఐసీయూ పడకలు ఏర్పాటు చేసినా అవి అందుబాటులోకి రాలేదు. 9 ఎకరాల్లో నిర్మితమైన ఇంత పెద్ద భవనానికి కనీసం సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది కూడా కేటాయించలేదు. ఈ కారణంగా ఖరీదైన పరికరాలున్న ఈ భవనానికి రక్షణ లేకుండా పోయింది. అవసరమైన వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్ సిబ్బందిని, నాల్గవ తరగతి ఉద్యోగులను నియమించి, తగిన పరికరాలను, పడకలను అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యసేవలు అందించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment