శ్రీశైలానికి 4,479 క్యూసెక్కుల వరద ప్రవాహం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయానికి ఎగువ సుంకేసుల నుంచి మంగళవారం సాయంత్రం సమయానికి 4,479 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 160.9100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 874.40 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 16,483 క్యూసెక్కుల నీరు విడుదలైంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3.127 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
పదిలో 100 శాతం ఫలితాలు సాధించాలి
నంద్యాల(అర్బన్):పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను మంగళవారం ఆయన ఎంఈఓ బ్రహ్మంనాయక్‌తో కలిసి తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉంటే చదువు పూర్తిస్థాయిలో అబ్బుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలను మించి ఫలితాలు సాధించాలన్నారు. ఇందుకు ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
నంద్యాల(రూరల్): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. డిసెంబర్ 23, 30 తేదీల్లో మచిలీపట్నం – కొల్లం (రైలు నెంబర్ 07147, 07148) వయా నంద్యాల మీదుగా ప్రత్యేక రైలు వెళ్తుంది. ఆయా తేదీల్లో రైలు రాత్రి 8.45 గంటలకు నంద్యాలకు చేరుకొని, కొల్లంకు మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుందని, అదేవిధంగా కొల్లంలో డిసెంబర్ 25, జనవరి 1 తేదీన ఉదయాన్నే 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 2.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని ఆయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ శబరి మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.
సాంకేతికతను మంచికే వినియోగించాలి
బొమ్మలసత్రం: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా సూచించారు. మంగళవారం ఆయన స్థానిక కార్యాలయంలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాలు, సాంకేతికత వినియోగం, వివాదాస్పద వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. చాలా మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడి మోసపోతున్నారన్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకూడదన్నారు. ప్రసారమాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని అనాలోచితంగా ఇతరులతో పంచుకోరాదన్నారు. సైబర్ నేరాలకు పాల్పడితే విధించే శిక్షలు, తదనంతర పరిణామాలను వివరించారు. సీ్త్రల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఎలాంటి పరిస్ధితుల్లో అయినా పోలీసుల సహాయం కోసం 100, 112 నంబర్లకు, సైబర్ నేరాలతో మోసపోతే 1930 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ గాయత్రి, ఉపాధ్యాయులు సర్ఫరాజ్, అనిత, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment