‘స్వర్ణరథం’పై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లు స్వర్ణరథంపై ఊరేగారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఈ కార్యక్రమం నిర్వహించింది. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి ఆలయ నాలుగు మాఢవీధుల గుండా ఈ కార్యక్రమం సాగింది. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, సహయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment