మిడుతూరు: ఉపాధి హామీ పనుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ జనార్దన్ రావు హెచ్చరించారు. మిడుతూరు మండలంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 19 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే పనులు చేపట్టగా రూ. 26 లక్షలు అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ సభ్యులు వెల్లడించారు. చెరుకుచెర్ల, మిడుతూరు గ్రామ పంచాయతీల పరిధిలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగంతో పాటు కూలీలు లేకుండానే మస్టర్‌లో హాజరు నమోదు చేసినట్లు తేలిందన్నారు. అయితే, దుర్వినియోగం రూ. 26 లక్షలు జరిగితే డ్వామా అధికారులు రూ. 4, 66, 642 కు మాత్రమే రికవరీకి ఆదేశించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చెరుకుచెర్ల ఫీల్డ్ అసిస్టెంట్‌పై డ్వామా పీడీ జనార్దన్ రావు విచారణకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం 70 శాతం పనులు ఉపాధి కూలీలతో చేపడతామని, 30 శాతం రోలింగ్ చేయడానికి ఆవకాశం ఉన్నట్లు పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దశరథరామయ్య, నంద్యాల డివిజన్ ఏపీడీ బాలజీ నాయక్, అసిస్టెంట్ డీవీఓ షీబారాణి, ఏపీఓ జయంతి, క్వాలిటీ కంట్రోల్ అధికారి గంగాద్రి, ఎస్‌ఆర్‌పీ మురాద్, , డీఆర్‌పీలు పాల్గొన్నారు.
● సామాజిక తనిఖీ బహిరంగ సమావేశంలో డ్వామా పీడీ జనార్దన్ రావు
● రూ. 4, 66, 642 రికవరీకి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment