ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజ్యాంగానిదే కీలకపాత్ర
● భారత రాజ్యాంగ దినోత్సవంలో
జేసీ విష్ణుచరణ్
నంద్యాల: ప్రజాస్వామ్య పరిరక్షణలో భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 75వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగం ఏర్పాటైనప్పటికీ 1950 జనవరి 26 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందన్నారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు మన రాజ్యాంగం దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ బద్ధంగానే అసెంబ్లీ, పార్లమెంట్లలో నూతన విధానాలను ప్రవేశపెట్టి ఆమేరకే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి భారతీయుడు కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా స్వేచ్ఛగా తన భావాలను, అభిప్రాయాలను వెల్లడించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు అని చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశానికి దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీఎస్‌ఓ వెంకట్రాముడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, సీపీఓ వేణుగోపాల్ ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోండి
నంద్యాల(అర్బన్): జిల్లాకు చెంది ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపు, ఈబీసీ, డిజేబుల్ విద్యార్థినీ విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరానికి గాను పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ రెన్యువల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారత అధికారిణి చింతామణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు https://jnanabhumiv2.apcfss.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆతర్వాత గ్రామ/వార్డు సచివాలయాల్లో విద్యా సంక్షేమ సహాయకుల లాగిన్ ద్వారా ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment