బ్రహ్మోత్సవం..సకల దేవతలకు ఆహ్వానం
● శ్రీశైలంలో మకర సంక్రాంతి
ఉత్సవాలకు అంకురార్పణ
● పంచాహ్నికదీక్షతో శాస్త్రోక్తంగా
ఏడురోజుల పాటు వేడుకలు
● నేడు భృంగివాహనంపై భక్తులకు
దర్శనమివ్వనున్న స్వామిఅమ్మవార్లు
మల్లన్న ఆలయంలో ధ్వజ పటావిష్కరణ దృశ్యం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభంపై పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండుసార్లు అనగా మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్బంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా శనివారం ఉదయం యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం వేదపండితులు వేదపఠనంతో వేదస్వస్తి నిర్వహించారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పం పఠించారు. గణపతిపూజ, వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యాహవాచనం జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవ నిర్వహణకు ఆధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేష పూజలు చేశారు. చండీశ్వర అర్చన తరువాత కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ఈఓ, అధికారులు, అర్చకస్వాములు, స్థానాచార్యులు కంకణాలు ధరించారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ చేశారు. ఆలయ ప్రాంగాణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని సేకరించి సంప్రదాయబద్ధంగా యాగశాలకు తీసుకువచ్చి, ఆ మట్టిని 9 పాలికలలో నింపి దాంట్లో నవధాన్యాలు పోసి ఆ మట్టిని మొలకెత్తించే పనిని ప్రారంభించారు. తర్వాత ధ్వజా రోహణ కార్యక్రమంలో భాగంగా నంది ధ్వజపటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి చండీశ్వరస్వామి సమక్షంలో పూజలు నిర్వహించారు. అలాగే భేరిపూజలో డోలు వాద్యానికి పూజలు చేశారు. అనంతరం నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
నేడు భృంగి వాహన సేవ
సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సేవలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్లను ఆశీనులు చేసి ప్రత్యేక పూజల అనంతరం గ్రామపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment