శాస్త్రోక్తంగా కూడారై ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలోని ప్రహ్లాదవరదస్వామి సన్నిధిలో ధనుర్మాస పూజలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. గోవిందా నామస్మరణ మార్మోగుతోంది. 27వ రోజైన శనివారం కూడారై ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా దిగువ అహోబిలంలో కొలువైన మూలమూర్తులైన శ్రీప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేకువ జామునే సుప్రభాత సేవతో మేలుకొలిపి దివ్యదర్శనం కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లతో పాటు గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలతో పాటు అర్చన, హారతి ఇచ్చారు. ఉత్సవ మూర్తులను యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన, అభిషేకం, పంచామృతాభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, ఆండాల్ అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో 108 గంగాళాల్లో (పాత్రలు) 108 రకాల్లో వండిన పాయసాలు (ప్రసాదాలు)తో కూడారై ఉత్సవం నిర్వహించారు. రాత్రి ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించి కార్యక్రమం ముగించారు.
గోవింద నామస్మరణతో
మార్మోగిన అహోబిలం
లక్ష్మీనరసింహాస్వామి, గోదాదేవిని
దర్శించుకునేందుకు
బారులు తీరిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment