పోతిరెడ్డిపాడు నుంచి పెరిగిన నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల పెరిగింది. శ్రీశైల జలాశయంలో శనివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో 858.60 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 857.60 అడుగులుగా నమోదైంది. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేస్తున్న 1,500 క్యూసెక్కుల నీటిని 2,500కు పెంచారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి కేసీ ఎస్కేప్ కాల్వకు 1,200 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్) కాల్వకు 1,300 క్యూసెక్కుల నీరు వదిలారు. తెలుగుగంగ కాల్వకు నీటి సరఫరా నిలిపి వేసినట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయంలో మరో నాలుగు అడుగుల నీటిమట్టం తగ్గిందంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్ కాల్వల కింద సాగుచేసిన రబీ పంటలకు సాగునీరు అందటం కష్టమవుతుంది.
18 నుంచి బ్యాడ్మింటన్, షటిల్ పోటీలు
నంద్యాల(న్యూటౌన్): రిపబ్లిక్ డేను పురస్కరించుకొని నంద్యాల కాస్మో పాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్, షటిల్, డబుల్స్, మిక్స్‌డ్, త్రిబుల్స్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు ఆదినారాయణ, స్పోర్ట్స్ సెక్రటరీ కాంతారెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ ఖాన్ తెలిపారు. శనివారం వారు పట్టణంలో పోటీలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. బ్యాడ్మింటన్ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులందరూ ఈనెల 16లోగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11గంటల వరకు క్లబ్ ఆవరణలో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీవీ రెడ్డి, శివ, మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
26లోపు ఇంటర్‌విద్యలో
సంస్కరణలపై సలహాలివ్వండి
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ విద్యలో ప్రతిపాదించిన సంస్కరణలపై ఈనెల 26వ తేదీలోపు విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని డీఐఈఓ సునిత శనివారం ఒక ప్రకటనలో కోరారు. 2026–27 విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో సవరించబడిన ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో bieap.gov.in వెబ్ సైట్‌లో అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
పడిపోతున్న ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధరలు మరింత పడిపోతున్నాయి. 2024లో పండించిన ఉల్లి ధర గరిష్టంగా రూ.5,000 దాటింది. బంగ్లాదేశ్‌కు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం ధరలపై ప్రభావం చూపుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 60 శాతం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లేది. అయితే ఆ రాష్ట్రం ఉల్లి దిగుమతులను అడ్డుకుంది. దీంతో ఉల్లి ధరలు పతనం దిశగా సాగుతున్నాయి. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండటం కూడా రైతులు నష్టపోవడానికి కారణమవుతోంది. శనివారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి 868 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.538, గరిష్ట ధర రూ.2,469 లభించింది. సగటు ధర రూ.1,639 మాత్రమే నమోదైంది. సగటు ధరను పరిశీలిస్తే రైతులకు రూ.1000 నుంచి రూ.1600 వరకు మాత్రమే లభిస్తోంది. ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment