పథకం ప్రకారమే ఎన్నిక వాయిదా వేయించారు
నంద్యాల(అర్బన్): టీడీపీ నేతలు పథకం ప్రకారమే విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక వాయిదా వేయించారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. అధికారం కలకాలం ఎవరి వద్ద ఉండదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక ఉదయానంద రెసిడెన్షిలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పింది.. నామినేషన్లను అడ్డుకుంటామని టీడీపీ నాయకులు చెప్పడం దుర్మార్గమన్నారు. ఎవరినీ నామినేషన్ వేయనివ్వమని బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బయటి వ్యక్తులను డెయిరీ ఆవరణలోకి రాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.
హైకోర్టులో పిటిషన్ వేయడం దారుణం..
విజయ డెయిరీ ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉన్నా .. వాయిదా ఎందుకు కోరారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయ డెయిరీకి అప్పు ఉన్న జగత్ విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్ అయ్యారని, అటువంటి వారికి సంస్థలో చోటు లేదన్నారు. అడ్డదారిలో డైరెక్టర్ పదవులు దక్కించుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి..
విజయడెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతల సమస్య ఉందని, నియంత్రణ చేయలేమంటూ ఎన్నికలు వాయిదా వేయాలని పోలీసులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి ప్రోద్బలంతో వాయిదా వేయించారో పోలీసులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి డెయిరీలో టీడీపీ నాయకులు అలజడులు సృష్టిస్తూనే ఉన్నారన్నారు. పోలీసులు, అధికారులు పునరాలోచన చేసి డెయిరీ డైరెక్టర్ల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో నాయకులు విజయసింహారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.
డెయిరీ ఎన్నిక సజావుగా
నిర్వహించాల్సిన బాధ్యత
ప్రభుత్వానిదే
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment