ఊరికి దేవుడొచ్చాడు !
ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడు ఊరూరా పూజలందుకుంటూ శుక్రవారం ఆర్‌కృష్ణాపురం చేరుకున్నారు. బాచేపల్లి, కొండపల్లిలో పూజలు ముగించుకున్న అనంతరం ఆర్. కృష్ణాపురం చేరుకున్న స్వామి వారి ఉత్సవ పల్లకీకి గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలతో గ్రామంలోకి తోడ్కొని వచ్చారు. స్వామి రాకతో గ్రామంలోని ఇళ్లు బంధుగణంతో కిటకిటలాడాయి. ప్రధాన రహదారి వెంట బొమ్మల అంగళ్లు, మిఠాయి కొట్లు, రంగులరాట్నాలు కొలువు దీరటంతో గ్రామంలో తిరునాల సందడి నెలకొంది.
నేడు ‘స్వచ్ఛ ఆంధ్ర’
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీని ప్రారంభించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్‌లో స్వచ్ఛత కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి చెత్తాచెదారం తొలగించాలన్నారు. పరిశుభ్రత నెలకొల్పే అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment