ముగ్గురిని మింగిన అతివేగం
ప్యాలకుర్తి వద్ద ఢీకొన్న కారు, ఐచర్ వాహనం ● రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి
కోడుమూరు రూరల్: అతివేగం ముగ్గురు వ్యక్తులను బలితీసుకుంది. లారీ, ఐచర్ వాహనం ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన శుక్రవారం ప్యాలకుర్తి వద్ద చోటు చేసుకుంది. కోడుమూరుకు చెందిన సోమశేఖర్ (56), బండ శ్రీనివాసులు (46), రాజోలి శ్రీను (36) పట్టు వస్త్రాల వ్యాపారం చేస్తున్నారు. వీరు ముగ్గరు కారులో కర్నూలుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్యాలకుర్తి గ్రామ సమీపాన ఆర్‌టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వేగంగా వస్తున్న ఐచర్ వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని బండ శ్రీనివాసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలకు గురైన సోమశేఖర్, రాజోలి శ్రీనులను చికిత్స నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడు సోమశేఖర్ కోడుమూరులోని 16వార్డు సభ్యుడు. ఈయనకు భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బండ శ్రీనివాసులుకు భార్య శ్రీలలిత, ఇద్దరు కుమారులు, రాజోలి శ్రీనుకు భార్య సుమశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఏడాదిలోపు బాబు ఉన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ
విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్‌పీటీసీ సభ్యుడు రఘునాథ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యరత్న, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సీబీ లత, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ తదితరులు కోడుమూరు ప్రభుత్వాసుపత్రి చేరుకున్నారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురిది ఒకే సామాజిక వర్గం, వరుసకు బంధువులు కావడంతో కోడుమూరులో విషాదఛాయలు అలుము కున్నా యి. కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment