తగ్గుతున్న నీటిమట్టం
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద రోజు రోజుకు నీటిమట్టం తగ్గిపోతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 854.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రస్తుతం హెడ్‌రెగ్యులేటర్ రెండు గేట్ల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి కేసీ ఎస్కేప్ కాల్వకు 1,300 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్) కాల్వకు 1,200 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం జలాశయంలోని నీటిని ఎడాపెడా వినియోగిస్తుంది. దీంతో రోజు రోజుకు జలాశయంలో నీటిమట్టం తగ్గుతోంది. ఫలితంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద కూడా నీటిమట్టం తగ్గిపోతుండటంతో అధికారులు కాల్వలకు నీటిసరఫరాను క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారు. ఎస్సార్బీసీ, కేసీ ఎస్కేప్, తెలుగుగంగ కాల్వల కింద రబీ సీజన్ సాగుచేసిన పంటలు పూర్తిస్థాయిలో చేతికందాలంటే కనీసం మార్చి నెలాఖరు వరకు కాల్వలకు సాగునీరు సరఫరా కావాలి. శ్రీశైల డ్యాంలో మరో ఆరు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి విడుదలకు ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితి ఎదురైతే తమ పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పక్షం రోజుల్లో పోతిరెడ్డిపాడు నుంచి
నిలిచిపోనున్న నీటి సరఫరా
ఆందోళనలో రైతన్నలు
Comments
Please login to add a commentAdd a comment