నేడు శ్రీరామనవమివేడుకలు | Sakshi
Sakshi News home page

నేడు శ్రీరామనవమివేడుకలు

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

ముస్తాబైన ఆలయాలు

నారాయణపేట రూరల్‌: శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. 69 చోట్ల సీతారాముల కల్యాణం, రథోత్సవాలు, శోభాయాత్రలు, పల్లకీసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత ఆలయాల కమిటీ సభ్యులు పూర్తి చేశారు. ఇప్పటికే ఆలయాలు రంగురంగుల విద్యుద్ధీపాలు, మామిడి తోరణాలు, పూలతో కళకళలాడుతున్నాయి. జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణ్‌వాడి రామాలయం, మూలహనుమాన్‌, సాయిహనుమాన్‌, గొడుగుగేరి హనుమాన్‌, మెట్టుగడ్డ హనుమాన్‌ ఆలయాలతో పాటు జాజాపూర్‌ జట్టి హనుమాన్‌, అప్పిరెడ్డిపల్లి రాందేవునిగుట్ట, తిర్మలాపూర్‌ తిరుమలనాథస్వామి ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నంలో కల్యాణం, అనంతరం భక్తులకు అన్నదానం, సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

● వేడుకలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్‌ కోరారు. మంగళవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పూర్తిస్థాయి బందోబస్తు కల్పించాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు.

వరి పంట

కోత ప్రయోగం

ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌లో రైతు ఖాజామియా సాగు చేసిన వరి పంటను జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి జీవరత్నం, మండల గణాంక అధికారి చేతన్‌ బుధవారం సందర్శించి పంట దిగుబడి అంచన వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటలో ఐదు మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో పంట కోత ప్రయోగం చేయగా 14.990 కిలోల దిగుబడి వచ్చిందని వివరించారు. విత్తన సేకరణ, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వాటికి అయిన ఖర్చులను రైతును అడిగి తెలుసుకున్నారు. రైతులు రాఘవేందర్‌గౌడ్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement