‘పేట’ ఆర్టీసీ డీఎంగా లావణ్య | - | Sakshi
Sakshi News home page

‘పేట’ ఆర్టీసీ డీఎంగా లావణ్య

Published Sat, Aug 24 2024 12:54 AM | Last Updated on Sat, Aug 24 2024 12:54 AM

‘పేట’ ఆర్టీసీ డీఎంగా లావణ్య

నారాయణపేట రూరల్‌: నారాయణపేట ఆర్టీసీ డిపో నూతన డీఎంగా లావణ్య నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మిసుధ హైద్రాబాద్‌కు రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకోగా గత నెల 31న ముగ్గురు డీఎంలకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల్లో ఈమెకు మహేశ్వరం డిపో కేటాయించారు. అయితే ఆమె స్థానంలో హైద్రాబాద్‌ జోన్‌ ఈడీ సెక్రెటరీగా పనిచేస్తున్న పీ.శ్రీనివాస్‌ను నారాయణపేట డీఎంగా కేటాయించారు. కాగా ఆయన రాకపోవడంతో లక్ష్మిసుధ రిలీవ్‌ కాలేదు. అయితే పీ.శ్రీనివాస్‌ నారాయణపేటకు రావడం ఇష్టం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆపరేషన్‌ విభాగంలో పనిచేస్తున్న లావణ్యకు డీఎంగా పదోన్నతి కల్పిస్తూ పేట డిపో కేటాయించారు. ఈ మేరకు శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

అనుచిత పోస్టులు

పెడితే చర్యలు

నారాయణపేట రూరల్‌: సామాజిక మాద్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతీయ, రాజకీయ పరంగా ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్‌ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగామ్‌, వాట్సప్‌ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్నా, తమకు తెలియని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ చేసిన ఆ గ్రూపు అడ్మిన్‌ని బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్‌ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయి అని అన్నారు. సామాజిక మద్యమాలను మంచి పనులకు తప్ప వేరే రకంగా వినియోగించే వాళ్లపైన ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉంటారని, ఇలాంటి వాటికి పాల్పడే వారిని వెంటనే పట్టుకొని కేసులు నమోదు చేస్తామన్నారు.

ముగిసిన పీజీ పరీక్షలు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఏడు కేంద్రాల్లో శుక్రవారం పీజీ పరీక్షలు (నాలుగో సెమిస్టర్‌) ముగిశాయి. విద్యార్థులు ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు రాశారు. పీజీ కళాశాల కేంద్రాన్ని పరీక్షల నియంత్రణ అధికారి రాజకుమార్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌ చంద్రకిరణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చూచిరాతలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరి రోజు 465 మందికి గాను 461 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు.

జార్జిరెడ్డి స్ఫూర్తితోవిద్యార్థి ఉద్యమాలు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పీడీఎస్‌యూ ఆవిర్భవించి 50 ఏళ్లు అవుతుందని, ఈ 50 ఏళ్లలో చేసిన పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగుదామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పీడితులు, తాడితుల తరపున అనేక పోరాటాలు చేసి వారికి రక్షణగా నిలిచామన్నారు. మతోన్మాద, కుల రాకాసుల ఆగడాలను వ్యతిరేకించిన జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలు చేపట్టామన్నారు. మతోన్మాద గుండాలు 1972 ఏప్రిల్‌ 14న జార్జిరెడ్డిని కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారన్నారు. జార్జిరెడ్డి చిందించిన రక్తపు చుక్కల నుంచి పీడీఎస్‌యూ పోరాట జెండాలు మరింత కసిగా ఎత్తిందన్నారు. విద్యార్థుల సమస్యల నుంచి అధిక ధరలు, రాజకీయ సమస్యల దాక.. ర్యాంగింగ్‌ నుంచి మహిళలు, దళితులు బలహీన వర్గాల బాగు కోసం ఎన్నో పోరాటాలు చేసినట్లు వివరించారు. విద్య రంగంపై పీడీఎస్‌యూ చేసిన పోరాటాలతో అనేక మార్పులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారాం, నాయకులు రాకేష్‌, చెన్నకేశవులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement