ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి
మద్దూరు: కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను అదేశించారు. బుధవారం మండలంలోని పల్లెగడ్డతండా, దోరేపల్లి తండాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్ని క్వింటాళ్ల ధాన్యం సేకరించారని నిర్వాహకులను, సరాసరి ఎంత దిగుబడి వచ్చిందని రైతులను ఆరా తీశారు. కేంద్రాలకు అవసరమైన కాంటాలు, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. మండలంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు మంజూరు చేశారు, ఇప్పటి వరకు ఎన్ని ప్రారంభించారని అధికారులను అడగగా 18 కేంద్రాలు మంజూరయ్యాయని. ఇప్పటి వరకు 15 ప్రారంభించామని, మిగిలిన 3 కేంద్రాలను త్వరలో ప్రారంభింస్తామని సమాధానమిచ్చారు. ఐకేపీ, సివిల్‌సప్లై, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం మద్దూరులో ఇంటింటి సర్వేను పరిశీలించి ఏమైన సమస్యలున్నాయా అని సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 138మంది ఎన్యుమరేటర్ల ద్వార ఉమ్మడి మద్దూరు మండలంలో సర్వే చేస్తున్నట్లు ఎంపీడీఓ నర్సింహరెడ్డి కలెక్టర్‌కు వివరించారు. డీఎం దేవదాస్, ఏఓ రామకృష్ణ, ఎంపీఓ రామన్న పాల్గొన్నారు.
గ్రూప్–3 పరీక్షలకుపకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో 4200 మంది రాయనున్నారని, ఈమేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ వివరించారు. బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరీక్షకు ఒకరోజు ముందు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షహాలులోకి అనుమతించబడదని, హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా తీసుకు రావాలన్నారు. ఆర్డీఓ రామచందర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment