మధ్యాహ్న భోజనం.. రాజకీయ దుమారం
మాగనూర్: ఓ వైపు రెండు రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గురువారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు భోజనం చేయకుండానే ఆర్థాకలితో ఆలమటించారు. దీంతో అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విద్యార్థులతో మాట్లాడి వారి కోసం బియ్యం తెప్పించి మధ్యాహ్న భోజనం వడ్డించినట్లు తెలిపారు. ఇదే అంశంపై పాఠశాల తనిఖీకి వచ్చిన రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం ముందు కాంగ్రెస్ మండల నాయకులు ఆందోళనకు దిగారు. బియ్యం బాగా లేకపోవడంతో ఆర్డీఓ ప్రభుత్వ పరంగా బయట నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి వంట వండి విద్యార్థులకు వడ్డించారని, అయితే, మాజీ ఎమ్మెల్యే మాత్రం తానే సొంత డబ్బులతో బియ్యం తీసుకువచ్చి వంట చేశామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డీఓ రాంచందర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆర్డీఓ మీడియాతో మాట్లాడారు. రెండో సారి విద్యార్థులకు భోజనం కోసం వాడిన బియ్యం ప్రభుత్వం తరపున తీసుకువచ్చిన బియ్యమని అన్నారు. విద్యార్థుల విషయంపై రాజకీయం చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. అయితే పాఠశాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో డీఎస్పీ లింగయ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. మక్తల్ సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ పి. ఆశోక్‌బాబు, కృష్ణ ఎస్‌ఐ నవీద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment