భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
కృష్ణా: మండల కేంద్రంలోని క్షీరలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండగా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 13, 14న నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. కృష్ణానది వద్ద స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు వాహనాల పార్కింగ్‌ను ఆలయ సమీపంలో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ జానయ్య, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, ఎస్‌ఐ ఎండీ నవీద్, వ్యవసాయ అధికారి సుదర్శన్‌గౌడ్, ఏపీఎం బస్వరాజ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అలసందలు క్వింటా రూ.7,411
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం అలసందలు క్వింటాకు గరిష్టం, కనిష్టంగా రూ.7,411 ధర పలికింది. అలాగే, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,509, కనిష్టంగా రూ.2,100, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,556, కనిష్టంగా రూ.7,209, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,609, కనిష్టంగా రూ.6,350 ధరలు పలికాయి.
కొల్లాపూర్‌లో
అంతర్జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాలలో ఈ నెల 28, 29 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో పర్యావరణం, సుస్థిర అభివృద్ధి అనే అంశాలపై నిర్వహించే సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రొఫెసర్లు హాజరవుతారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్క్‌పోలోనీస్, అధ్యాపకులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్లాపూర్‌లోని పీజీ కళాశాలలో నిర్వహించే సదస్సుకు కన్వీనర్‌గా సోషల్‌వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవరాజ్ వ్యవహరిస్తారని పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ వెల్లడించారు.
విజయోత్సవ సభ బ్రోచర్ ఆవిష్కరణ
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, లా కళాశాలలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా బుధవారం నిర్వహించే విజయోత్సవ సభకు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ జీఎస్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాము, కార్తిక్, పవన్‌కుమార్, వంశీకుమార్ పాల్గొన్నారు.
శనేశ్వరుడికి
తిలతైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్‌లోని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుంచే బారులుదీరిన భక్తులతో శనేశ్వరాలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి గోత్రనామార్చన పూజలు, అభిషేకాలు, ప్రదక్షిణలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడికి రుద్రాభిషేకం చేశారు.
స్కాలర్‌షిప్‌నకు
ఆధార్ సీడింగ్ తప్పనిసరి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకునే వారి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరిగా చేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సుదర్శన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 4,568 మంది అర్హులైన విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 2,055 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఎస్సెస్సీ మెమో, బ్యాంక్ అకౌంట్‌కు సీడింగ్ చేయించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment