మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
నారాయణపేట: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన తర్వాతే పిల్లలకు పెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎంఈఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం తనిఖీలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పాఠశాలల్లో పాత స్టాక్ మార్చి, కొత్త స్టాక్ ఏర్పాటు చేశామని ఎంఈఓలు కలెక్టర్‌కు వివరించారు. అయితే వంద శాతం బియ్యం మార్చినట్లు రిపోర్టు ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. బియ్యం సంచులను ఎత్తు ప్రదేశంలో ఉంచాలని సూచించారు. వంట ఏజెన్సీ వారు శుభ్రత పాటించాలని తెలిపారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. తాజా కూరగాయలతో భోజనం వడ్డించాలన్నారు. ముఖ్యంగా వంటకాల తయారీలో సన్‌ఫ్లవర్ నూనె వాడాలన్నారు. అలా వాడని పాఠశాలల హెచ్‌ఎంలకు మెమోలు ఇవ్వాలన్నారు. అన్ని పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీ ఉండాలన్నారు. కమిటీ లేని స్కూల్‌లో చార్జీ మెమో ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌పై యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. కొత్త టీచర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హ్యాండ్‌వాష్, శానిటేషన్‌పై ఆరా తీశారు. సమావేశంలో డీఈఓ గోవిందరాజులు ఉన్నారు.
ప్రజావాణికి 35 ఫిర్యాదులు..
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 35 ఫిర్యాదులు అందగా.. వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఏఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment