క్రీడలతో మానసికోల్లాసం
నారాయణపేట రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని డీఎస్పీ లింగయ్య అన్నారు. మండలంలోని అభంగాపూర్‌లో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత నిత్యం మైదానంలో ఆటలు ఆడాలని, శారీరకంగా దృఢంగా ఉంటే పోలీసు, ఆర్మీ లాంటి ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివేకానందుడి బోధనలు యువతకు స్ఫూర్తిదాయకమని.. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అని, సమాజాభివృద్ధికి రామకృష్ణ మఠం స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓడిన వారు బాధపడకుండా గెలుపునకు ప్రయత్నించాలని సూచించారు. సీఐ శివకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నర్సింహులు, మాజీ సర్పంచ్ వర్ష, భగవంత్, లక్ష్మీకాంత్, రాములు, రమేశ్, చెన్నప్ప పాల్గొన్నారు.
ధర్నాను జయప్రదం చేద్దాం
నారాయణపేట రూరల్: అన్ని అర్హతలున్న గ్రామపంచాయతీలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి బి.రాము, పార్టీ జిల్లా నాయకుడు బలరాం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా ఏర్పాటు సమయం నుంచి కోటకొండను మండల కేంద్రం చేయాలని కోరుతున్నప్పటికీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన కోసం ఏర్పాటుచేసిన కేశవరావు కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకత్వానికి వినతిపత్రాలు అందజేశామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కక్షపూరితంగా వ్యవహరించి అన్యాయం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే ధర్నాలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి కె.కాశీనాథ్, జిల్లా నాయకులు యాదగిరి, వెంకట్రాములు, మైనుద్దీన్, సాయికుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జూరాలలో
నీటినిల్వ తగ్గుముఖం
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో వరదనీరు పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయంలోని నీటినిల్వ తగ్గుముఖం పట్టినట్లు సాగునీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టు జలాశయంలో 6.695టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో జలాశయంలో గ్రాస్‌లేవెల్ 2.988టీఎంసీలు, ఎంబీబీడీడీఎల్ పైస్థాయిలో 4.032టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వ, ఎడమ కాల్వ, ఆర్డీఎస్ ప్రాజెక్టుకు, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, జూరాల హైడల్ ప్రాజెక్టులకు నీటి పంపిణీ పూర్తిగా నిలిపేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment