ఊరూరా భోగి సందడి
మల్లయ్యస్వామి మూలవిరాట్
ఊట్కూర్‌లో భోగి మంటలు వేస్తున్న ప్రజలు
నారాయణపేట: సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి వేడుకలను సోమవారం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారుజామున నిద్రలేచి ముంగిళ్లను ముస్తాబు చేసి రంగవళ్లులతో అందంగా అలంకరించారు. భోగ భాగ్యాలు కలగాలని భోగి మంటలు వేయగా.. అడపచుడులు గొబ్బెమ్మలను పెట్టి పూజించారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడక్కడా బొమ్మలు కొలువులు ఏర్పాటుచేశారు. భోగి వేడుకల్లో ప్రత్యేక ముగ్గులను వేసి పాలపొంగులను పొంగించారు. మహిళలు వాయినాలను ఇచ్చుపుచ్చుకున్నారు. చిన్నారులు పతంగులను వేగరవేస్తూ ఆనందంగా గడిపారు. నేడు మంగళవారం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు చేరుకున్నారు. కష్టాలు తొలగి విజయం వైపు అడుగులు వేసేలా భగవంతుడు ప్రజలందరిని ఆశీర్వదించాలని కోరారు.
నేడు మైలపురం జాతర
కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా మైలాపురం కొండగుహాల్లో వెలసిన మల్లయ్యస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్త జనం ప్రత్యేక వాహనాల్లో అక్కడికి చేరుకుంటారు. కురమ, యాదవులు ఆరాధ్యదైవంగా భావించే మల్లయ్యస్వామికి భక్తులు.. గొర్రెపిల్లలు, గొంగళ్లను కానుకలుగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకోవడం అనవాయితీ. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాన పూజారి మహాలింగేశ్వరస్వామి కొలువైన కొండపై గండజ్యోతిని వెలిగిస్తారు. భక్తులు ఈ దీపాన్ని దర్శించుకొని పునీతులవుతారు. జాతరను పురస్కరించుకొని గ్రామ శివారు గల కోనేరులో స్వామివారి విగ్రహానికి స్నానాలు చేయించి పెద్ద ఎత్తున ఊరేగింపు చేపడతారు. స్వామివారికి గంగస్నానం, పల్లకీసేవ, గొలుసు తుంచే కార్యక్రమం భక్తుల శివనామస్మరణల మధ్య కొనసాగుతుంది. వానాకాలంలో పండిన పంటలను ఆ ప్రాంత భక్తులు రాసులుగా పోసి సమర్చించుకుంటారు. ఈ జాతర ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం నారాయణపేట, తాండూర్, గుర్మిట్‌కల్, యాద్గీర్, రాయిచూర్, గుల్బార్గా డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు బండారు (పసుపు) చల్లుకుంటూ నూనె, నెయ్యితో నైవేద్యం సమర్పించుకుంటారు. స్వామివారికి, గంగమాళ్ల వివాహాం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రంగులతో మెరిసిన లోగిళ్లు
పతంగులతో చిన్నారులు సంబరం
ముస్తాబైన మైలారం కొండ.. నేటి నుంచి జాతర ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment