‘రైతు భరోసా’కు సన్నద్ధం
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అయితే సాగుకు యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వబోమనే స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ నేతృత్వంలో జిల్యా వ్యవసాయ యంత్రాంగం భూ సర్వే చేసేందుకు సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని 77 క్లస్టర్లలో సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు గాను ఈ నెల 16 (గురువారం) నుంచి 20వ తేది వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ముందడుగు వేయనున్నారు. నిర్ధేశించిన ఐదు రోజుల్లో సాగుకు యోగ్యం కాని భూములను గర్తించడం సాధ్యమవుతుందో లేదోనని అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
నిర్ధారణ ఇలా
మండలంలోని తహసీల్దార్ , మండల వ్యవసాయాధికారి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ప్రతి గ్రామానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వ్యవసాయ విస్తరణ అధికారి లోకల్ టీంగా వ్యవహరిస్తారు. ప్రతి గ్రామానికి ఆర్‌ఓఆర్ పట్టదారు పాసుబుక్కుల జాబితాను భూ భారతి (ధరణి) పోర్టల్ నుంచి ప్రింట్ అవుట్ తీసుకొని, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్‌తో సహా గ్రామాన్ని సందర్శించి, ఈ జాబితాలో వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను తయారుచేస్తారు. తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లను సందర్శించి, వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తిస్తారు. ఈ విధంగా గుర్తించిన భూముల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాతనే ఆమోదింపజేస్తారు. గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికను భూ భారతి (ధరణి )పోర్టల్‌లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కాని భూములను తొలగించి మిగిలిన భూములకు రైతు భరోసా సాయాన్ని 26న ప్రభుత్వం విడుదల చేయనుంది.
సాగుకుయోగ్యం కాని..
భూ భారతి (ధరణి) పోర్టల్‌లో వ్యవసాయ భూములుగా నమోదై, వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తిస్తారు. ఇళ్ల నిర్మాణం, కాలనీలుగా మారినా, ఇళ్ల స్థలాలు, రాళ్లు రప్పలు, గుట్టతో నిండిన భూములు, స్థిరాస్థి లేఅవుట్లు, రోడ్లుగా మారినవి, పరిశ్రమలు నిర్మించినవి, గోదాములు, గనులకు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం వివిధ పథకాలకు సేకరించిన అన్ని రకాల భూములు సాగుకు యోగ్యం కాని వాటిగా గుర్తిస్తారు.
నేటి నుంచి ఐదు రోజులు భూ సర్వే
సాగుకు యోగ్యం కాని వివరాల సేకరణ
గ్రామసభ ద్వారా ఆమోదం..ప్రభుత్వానికి నివేదిక
26 నుంచి రైతుల ఖాతాల్లో యాసంగి పెట్టుబడి సాయం
Comments
Please login to add a commentAdd a comment