కత్తెర కాన్పులే..!
జనరల్ ఆస్పత్రిలో తగ్గిన సాధారణ ప్రసవాలు
జనరల్ ఆస్పత్రిలో సిజేరియన్ కాన్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పురుడు అంటేనే పునర్జన్మ లాంటిది. అలాంటిది కాన్పు.. కోతగా మారింది. శస్త్ర చికిత్సలతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకొని తాత్కాలికంగా మురిసిపోతున్నారు. అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర మాత్రమే సాధారణ కాన్పులు చేస్తున్నారు. చాలా వరకు వైద్యులు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయచేస్తున్నారు.
ప్రసవ కోతలతో దీర్ఘకాలిక ఇబ్బందులు..
● కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
● మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంతోనూ నొప్పులు వేధిస్తుంటాయి.
● హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.
● రెండో కాన్పు తప్పకుండా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది.
● సిజేరియన్ జరిగే సమయంలో గర్భాశయ పక్కన భాగాలపై గాయాలవడంతో పాటు ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.
● మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదముంటుంది.
● రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి.
● రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భ సంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది.
● గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్‌లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి.
● గాడి తప్పుతున్న గైనిక్ విభాగం
● వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తనపై విమర్శలు
● దృష్టి పెట్టని వైద్యారోగ్యశాఖ
పాలమూరు: ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పాలమూరు జనరల్ ఆస్పత్రిలో 2023తో పొల్చితే 2024లో ప్రసవాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. వైద్యుల సమయపాలన, సిబ్బంది వ్యవహారశైలి, వసతులు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భిణులు రావడం తగ్గిపోయారనే విమర్శలు ఉన్నాయి. 2024లో 58,150 మంది గర్భిణులకు ఓపీ చూడగా.. 9,240 మంది ఆస్పత్రిలో చేరగా 8,154 మందికి కాన్పులు చేశారు. ఇందులో 4,895 మంది గర్భిణులకు ఆపరేషన్ చేయగా 3,259 మందికి సాధారణ కాన్పులు చేశారు. 2023లో 8,774 ప్రసవాలు అయితే 4,991 మంది గర్భిణులకు సిజేరియన్ ద్వారా కాన్పులు చేశారు. 2023తో పొల్చితే 2024లో 620 కాన్పులు తగ్గాయి. ఏడాది మొత్తంలో జరిగిన కాన్పుల లెక్కల ప్రకారం చూస్తే 70 శాతం ఆపరేషన్ ద్వారా కాన్పులు అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రి గైనిక్ విభాగం సరిగా పనిచేయడం లేదనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. గైనిక్ హెచ్‌ఓడీ అధికంగా సెలవులో ఉండటం, విభాగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. గతంలో గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ రాధ నిత్యం విభాగంలో ఉంటూ వైద్యులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ వెళ్లడం వల్ల కొంత మెరుగైన ప్రదర్శన కన్పించింది. ప్రస్తుతం గైనిక్ విభాగంలో ఆ పరిస్థితి లేదు.
● గైనిక్ విభాగంలో పని చేసే వైద్యులకు చాలా వరకు బయట క్లినిక్‌లు ఉండటం వల్ల కొంతమంది సరైన సమయపాలన పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ పని చేసే సిబ్బంది వ్యవహారశైలికూడా సరిగా ఉండడం లేదని ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ గర్భిణి ప్రసవం అయిన తర్వాత మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. నిత్యం చిన్నపాటి ఘటనలు ఆస్పత్రిలో జరగడం పరిపాటిగా మారింది. కొంతమంది దురుసు ప్రవర్తనతో గర్భిణులు ఆస్పత్రికి రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment