మార్మోగిన మల్లన్న నామస్మరణ
నారాయణపేట: ‘ఏడు కోట్లు.. ఏడు కోట్లు.. మల్లయ్యకు ఏడు కోట్లు.. మైలరలిగేశ్వర్ మహారాజ్‌కు జైజైలు.. హొన్నకేరి మల్లయ్యకు జైజైలు.. గంగి మాలమ్మకు జైజైలు.. శివాయేళ్ కోటిగళ్– కోటిగే..’అంటూ భక్తుల శివనామస్మరణతో కొండ ప్రాంతమంతా భక్తిపారవశ్యంతో పులకించింది. మకర సంక్రాంతి పండుగ నాడు కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా మైలాపురం కొండగుహాల్లో వెలసిన మల్లయ్యస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర తారు రోడ్డు పసుపు మయమైంది. భక్తులు సమర్పించిన కానుకలతో హొన్నా సరస్సులో నీరు బంగారు(రంగులోకి) మయంగా మారింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రధాన పూజారి మహాలింగేశ్వరస్వామి కొలువైన కొండపై గండజ్యోతిని వెలిగించారు. భక్తులు ఈ దీపాన్ని దర్శించుకొని పునీతులయ్యారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్త జనం కురమ, యాదవులు ఆరాధ్యదైవంగా భావించే మల్లయ్యస్వామికి భక్తులు తమ గొర్రె పిల్లలు, గొంగళ్లను కానుకలుగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
భక్తిశ్రద్ధలతో..
కోస్గి: గొల్ల, కురుమ, యాదవుల ఆరాధ్యదైవం మల్లన్న దేవుని జాతరను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మల్లన్న దేవుని జల్దిబిందె వేడుకను ఘనంగా నిర్వహించారు. కర్ణాటకలోని మైలాపురం మల్లన్న దేవుని జాతర ఏటా సంక్రాంతి పండుగ మొదటి రోజు నిర్వహించే క్రమంలో అదే రోజు యాదవులు తమ కుల దైవానికి జల్దిబిందే పేరుతో ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. దేవుని మూల విరాట్‌కు జలస్నానం చేయించి పల్లకిలో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్తారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలతో పసుపు బండార్ చల్లుకుంటూ నిర్వహించిన ఊరేగింపుతో యాదవులు తరించారు. కోస్గి, చెన్నారం, మల్‌రెడ్డిపలి వేడుకలు నిర్వహించారు.
గంగస్నానం.. కల్యాణం
మైలారలింగేశ్వర జాతరలో ప్రధాన ఘట్టంలో గ్రామ శివారు గల కోనేరులో స్వామివారి విగ్రహానికి గంగ స్నానం మధ్యాహ్నం 12.30 గంటలకు భక్తుల మల్లయ్య స్వామి నామస్మరణలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహాల ఊరేగింపులో చెరకు, చిలగడదుంపలు, అరటిపండ్లు, శనగలు, మొక్కజొన్న గింజలు చెరకును విసిరి భక్తిని చాటుతూ మొక్కబడులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం పూజారుల మంత్రోచ్ఛరణల మల్లయ్య గొలుసును తుంచారు. రాత్రి బందండ ఓడెయ మైలార్ లింగ, గంగిమల వివాహ వేడుకలు మంగళవాయిద్యాల ధ్వనులతో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభోవపేతంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కనులపండువగా మైలార లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
దారులన్నీ పసుపుమయం
పులకించిన భక్తజనం
Comments
Please login to add a commentAdd a comment