స్పష్టత కరువు..!
కోస్గి: అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తూ పదవీవిరమణ పొందిన టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ పథకం కింద చెల్లించాల్సిన ఆర్థిక సహాయం నేటికి అందలేదు. పదవీ విరమణ పొందిన వెంటనే అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ ఆరు నెలలు గడిచినా నేటికి అందకపోవడంతో బాధితులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో భాగమైన అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ విధానం అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు అంగన్‌వాడీలకు సంబందించి ఎలాంటి రిటైర్మెంట్ విధానం లేకపోవడంతో వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధులు సైతం విధుల్లో కొనసాగారు. ఈ ఏడాది జూలై నుంచి 65 సంవత్సరాల వయస్సు నిండిన వారు తమ ఉద్యోగాల నుంచి రిటైర్ కావాలని ప్రభుత్వం అంగన్‌వాడీల్లో సైతం రిటైర్మెంట్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానం తక్షణమే అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏప్రిల్ 30 వరకు 65 ఏళ్లు పైబడిన టీచర్లు, హెల్పర్లు అందరికీ వెంటనే రిటైర్మెంట్ వర్తింపజేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
అమలుకు నోచుకోని హామీలు
గత ప్రభుత్వ హయాంలోనే అంగన్‌వాడీలకు సంబంధించి రిటైర్మెంట్ అంశం తెరపైకి వచ్చింది. అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఆర్థిక సహాయంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని పలు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తూనే గత కొన్ని సంవత్సరాలుగా అంగన్‌వాడీలు తమ డిమాండ్‌లను పరిష్కరించాలని పలు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలు సైతం అందించారు. అప్పట్లో అంగన్‌వాడీల ధర్నాలకు కాంగ్రెస్ మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్ సైతం పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించకపోవడంతో నేటికి ఆర్థిక సాయం విషయంలో స్పష్ఠత కరువైంది. కొత్త ప్రభుత్వంలో సైతం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇచ్చి, రిటైర్డ్ అయిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం అందించే సామాజిక ఆసరా పించన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్ సాయం అందించకపోవడతో పదవీ విరమణ పొందిన బాధితులు ఆర్థిక సాయం పెంచుతారనే ఆశలో ఉన్నారు.
జిల్లాలో 74 మందికి వర్తింపు
జిల్లాలో నారాయణపేట, మద్దూర్, మక్తల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 649 అంగన్‌వాడీ కేంద్రాలు, 55 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో 65 ఏళ్లు పైబడిన 74 ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో ప్రభుత్వం వారందరికి రిటైర్మెంట్ పథకం అమలు చేసింది. వయస్సు నిర్ధారణ కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన మరికొంత మంది వివరాలు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
ఐసీడీఎస్ ప్రాజెకులు:
నారాయణపేట, మక్తల్, మద్దూర్
రిటైర్ అయినవారు 74
జిల్లా వివరాలిలా..
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు అందని రిటైర్మెంట్ బెనిఫిట్
విరమణ పొంది ఆర్నెళ్లు పూర్తయిన వైనం
జిల్లాలో మూడు ప్రాజెక్టుల పరిధిలో74 మందికి తప్పని ఎదురుచూపులు
వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు
ఆర్నెళ్లుగా ఖాళీగానే పోస్టులు..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాలు పదవీ విరమణ పొందడంతో ఆర్నెళ్లు దాటిన నేటికీ ఆ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఖాళీలను నేటికి భర్తీ చేయకపోవడంతో కొన్ని చోట్ల టీచర్లు, మరికొన్ని చోట్ల ఆయాలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రిటైర్మెంట్ మూలంగా ఖాళీ అయ్యే స్థానాలను ఎప్పుడు భర్తీ చేస్తారన్న విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. రిటైర్మెంట్ అయిన కేంద్రాల్లో ఆయాలు లేని చోట అంగన్‌వాడీ టీచర్లే ఓ పక్క బోధన చేస్తూనే మరో పక్క ఆయా చేయాల్సిన పనులు సైతం చేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలు
649
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు
55
Comments
Please login to add a commentAdd a comment