పర్సంటేజీ ఇస్తేనే..!
పరిహారం చెక్కు కోసం రూ.8 లక్షలు ఇవ్వాలని ఓ అధికారి డిమాండ్
నారాయణపేట/నర్వ: భూ పరిహారం చెక్కు కావాలంటే పర్సంటేజీ ఇవ్వాలంటూ ఓ అధికారి రైతులను డిమాండ్ చేశాడన్న విషయం జిల్లా అంతటా కలకలం సృష్టిస్తోంది. తమ భూములు కోల్పోయినా.. మిగతా రైతులు అందరికీ సాగునీటి కష్టాలు తప్పుతాయనే నిర్ణయంతో కెనాల్ తవ్వేందుకు భూమిని ఇచ్చామని.. తీరా ఇప్పుడేమో పరిహారం చెక్కు కోసం వెళ్తే డబ్బు అడుగుతున్నాడని సదరు నిర్వాసిత రైతులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
గతంలో సాగునీటి కోసం సంగంబండ కెనాల్ ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన కెనాల్ కింద రైతులు తమ విలువైన భూములను కోల్పోయారు. అందులో నర్వ మండలంలోని లంకాల్ శివారులో ఉన్న పలువురు రైతులకు అప్పట్లో ప్రభుత్వం భూపరిహారం అందించింది. ఇందులో సర్వే నెంబర్ 302, 304, 305, 376, 377లో మొత్తం ఒక ఎకరా 38 గుంటల భూమి కెనాల్ భూసేకరణలో పోయిన లంకాల్ గ్రామానికి చెందిన రైతులు వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నకిష్టన్న, వీరన్నగౌడ్‌కు పరిహారంకు సంబందించి రూ.28 లక్షలు అందాల్సి ఉంది. పరిహారం కోసం రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు భూసేకరణ కార్యాలయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పరిహారం అందించలేదు.
కలెక్టర్ ఆదేశం.. ఆర్డీఓ విచారణ
అధికారి పర్సంటేజీ, రైతుల ఆందోళన నేపథ్యంలో విషయం తెలుసుకున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్ శనివారం విచారణకు ఆదేశించింది. దీంతో ఆర్డీఓ రాంచందర్ నాయక్ భూసేకరణ కార్యాలయం సిబ్బందితో సంబంధిత రికార్డులను తెప్పించుకొని విచారించారు. ఆర్డీఓ ఫోన్ చేసినా సదరు అధికారి లిఫ్ట్ చేయకపోవడంతో అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని సదరు అధికారికి ఆర్డీఓ అబ్‌సెంట్ వేశారు. ఇదిలాఉండగా, భూ సేకరణ కార్యాలయంలో సదరు అధికారి చాంబరులో ఫొటో తీసేందుకు ‘సాక్షి’ వెళ్లగా.. మా సారూ లేరు, ఫొటో తీసుకోవాలనుకుంటే సదరు అధికారిని అడిగి తీసుకోండి అంటూ పక్కనే ఉన్న ఓ అధికారి హుకూం జారీ చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లగా.. విలేకర్లు అడిగినప్పుడు ఉన్న సమాచారం ఇవ్వాలని సిబ్బందికి చెప్పుకొచ్చారు.
దిక్కుతోచని స్థితిలో సంగంబండ కెనాల్ భూ నిర్వాసితులు
ఇటీవల విషయం బయటకు పొక్కడంతో విచారణకు కలెక్టర్ ఆదేశం
క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలించిన ఆర్డీఓ.. సదరు అధికారికి ఆబ్‌సెంట్
Comments
Please login to add a commentAdd a comment