వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించాలి
మాగనూర్: రైతు భరోసా పథకానికి అర్హులను, వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించాలని, సర్వే వేగవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మండలంలోని బైరంపల్లిలో నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించారు. వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, వెంచర్లు, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, ఇతర అవసరాల కోసం వాణిజ్యపరంగా వాడుతున్న భూములను గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటి సురేష్ కూమార్, ఆర్‌ఐ శ్రీశైలం, ఏఈవో ప్రవీణ్ , జూనియర్ అసిస్టెంట్ ఆరవింద్ తదితరులు పాల్గొన్నారు.
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
నారాయణపేట ఎడ్యుకేషన్: వట్టెం జవహర్ నవోదయ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, లిటిలిస్టార్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మూడు పరీక్ష కేంద్రాలను కేటాయించగా మొత్తం 696 మంది విద్యార్థులకుగాను 578 మంది హాజరయ్యారు. 118 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ గోవిందరాజులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట ఎడ్యుకేషన్: గ్రూప్స్‌తో పాటు ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రషీద్ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆరుగురికి ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఆరుగురికి ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో నాగరాజు, తిరుపతయ్య, సురేందర్‌గౌడ్, ఆంజనేయులు, రామచందర్, శ్రీనివాసులు ఉన్నారు. వీరిలో ఐదుగురికి నారాయణపేట జిల్లాలో.. మరొకరికి నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. పదోన్నతి పొందిన ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లను డీఐజీ అభినందిస్తూ తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సుదీర్ఘ సేవలు, క్రమశిక్షణ గుర్తించి పదోన్నతి లభిస్తాయని, సేవలకు ప్రోత్సాహకరంగా ప్రతిఒక్కరూ ఉండాలని చెప్పారు.
చదువుతోపాటుక్రీడల్లో రాణించాలి
మాగనూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలో రాణించాలని డీఈఓ గోవింద్‌రాజులు అన్నారు. శనివారం ఆయన మండలంలోని వడ్వాట్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలకు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. ఆనంతరం వ్యాయామ పీరియడ్‌లో భాగంగా విద్యార్థులు ప్రదర్శిస్తున్న కరాటే విన్యాసాలను తిలకించి విద్యార్థులు చేస్తున్న ప్రదర్శనలను అభినందించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జరిగే ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. ఏవైన సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురురాజారావు, ఎస్‌వో యాదయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment