తిరుగు ప్రయాణానికి తిప్పలు
నారాయణపేట రూరల్: సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వచ్చిన ప్రయాణికులు.. సెలవులు ముగియడంతో సోమవారం పట్టణానికి తిరిగి ప్రయాణమయ్యారు. దీంతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులతో కిటకిటలాడింది. ఈ రద్దీని తగ్గించడానికి ఆర్టీసీ అదనపు సర్వీసులను ఏర్పాటు చేసింది. పల్లె వెలుగు, విద్యార్థుల బస్సులను సైతం హైదరాబాద్‌కు నడిపించింది. స్పెషల్ బోర్డు ఏర్పాటు చేసి అదనంగా డబ్బులను వసూలు చేసింది. అయినప్పటికీ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో బస్సులు సమయానికి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు సాయంత్రం నాలుగు గంటల తర్వాత బస్సులు లేక ఆపసోపాలు పడ్డారు. డిపోలో బస్సులు, డ్రైవర్ కండక్టర్లు అందుబాటులో ఉన్నా టికెట్లు ఇచ్చే మిషన్లు చార్జింగ్ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు లైన్ మీదికి బస్సులను పంపలేకపోయారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులతో వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మక్తల్, కోస్గి రూట్లలో సైతం ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. విద్యార్థుల బస్సుల రూటు మళ్లించడంతో సర్వీసులు లేక వారు సైతం ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
సరిపడా బస్సులు లేక బస్టాండ్ వద్దప్రయాణికుల పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment