నారాయణపేట: పదో తరగతి వార్షిక ఫలితాలలో జిల్లా ర్యాంకును గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలపాలి.. తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైతే హెచ్‌ఎంలే బాధ్యత వహించాలి.. ఇప్పటికై నా చెప్పాం.. చేశాం.. చూశాం.. అని కాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు ఇటీవలే నిర్వహించిన రివిజన్ టెస్ట్–1 ఫలితాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం డీఈఓ గోవిందరాజుల అధ్యక్షతన జిల్లాలోని ఎంఈఓలు, హెచ్‌ఎంలతో కలెక్టర్ సమీక్షించారు. ఫలితాలను చూసి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ మార్కులు రావడంపై ఇంతకీ ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన సమీక్షలో గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, గైర్హాజర్ అవుతున్నారని, సబ్జెక్టులు వారికి అర్థం కావడం లేదని ఏడాది చివర్లో, వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో చెబితే ఎలాగని, తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల హెచ్‌ఎంలపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి
ఉపాధ్యాయులు, విద్యార్థులపై కారణాలు చెప్పకుండా పాఠశాల పూర్తి బాధ్యత హెచ్‌ఎంలే తీసుకోవాలని, పాఠశాలల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. పరీక్షకు గైర్హాజర్ అయిన విద్యార్థులకు మరుసటి రోజు పరీక్ష రాయించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రివిజన్ చేయించాలన్నారు. ఉత్తీర్ణత తక్కువ వచ్చిన పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, రివిజన్–2 పరీక్షలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీఈఓకు కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికై నా ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, ఎంఈఓ లు తమ తమ పరిధిలో శాయశక్తులా విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకొని, అర్థం కాని సబ్జెక్టుల చాప్టర్లపై వీలైనంత ఎక్కువగా రివిజన్ చేయించి పరీక్షలను బాగా రాసేలా విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ఇకపై రివిజన్ టెస్ట్–2 లో ఉత్తీర్ణత శాతం తగ్గితే ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు నోటీసులు ఇవ్వాలని, అలాగే ఈ సమీక్ష సమావేశానికి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజర్ అయిన హెచ్‌ఎం లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, సీఎంఓ రాజేందర్, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నారాయణపేట: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాకు చెందిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతలను నోడల్ అధికారులకు కలెక్టర్ అప్పగించారు. ఇప్పటికీ ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాలకు సిద్ధం చేయగా ఎన్నికల పర్యవేక్షకులకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని నియమించి పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో డీఈవో గోవిందరాజులు మాన్ పవర్ మేనేజ్‌మెంట్, డీఆర్‌డీఓ మొగులప్ప బ్యాలెట్ బాక్స్ మేనేజ్మెంట్, డీటీఓ మెగా గాంధీ రవాణా, పీఆర్ డీఈ జ్యోతి శిక్షణ, డీఏవో జాన్ సుధాకర్ సామగ్రి, జెడ్పీ సీఇఓ భాగ్యలక్ష్మీ ఎంసీఎంసీ, ఎక్స్పెండిచర్ అకౌంట్స్, ఆంజనేయులు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మేనేజ్‌మెంట్, డీసీఓ సుదర్శన్ పరిశీలకులు, అంజయ్య బ్యాలెట్ పేపర్, ఎం ఏ రషీద్ మీడియా వ్యవహరిస్తారని కలెక్టర్ వెల్లడించారు.
పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment