ఢిల్లీ: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా ఎలాంటి అదనపు ఆంక్షలను పౌరుడు ఎవరైనా సరే విధించరాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై అధిక పరిమితులు విధించలేం. వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా హక్కు దృష్ట్యా ఈ తీర్పు వెల్లడిస్తున్నాం. పౌరుల హక్కులకు విరుద్ధంగా ఒక మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగ హింసగా పరిగణించబడదు. అలాగే ఆ మంత్రి చేసిన ప్రకటనను మొత్తానికి ప్రభుత్వానికి కూడా ఆపాదించలేం. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 తేడాతో తీర్పును వెల్లడించింది. ధర్మాసనంలో మెజారిటీ తీర్పుతో విభేదించారు జస్టిస్ నాగరత్న.
పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటన రాజ్యాంగపరమైన హింసగా పరిగణించబడదు, కానీ అది ఒక ప్రభుత్వ అధికారిని తప్పించడం లేదా నేరం చేయడానికి దారితీస్తే అది రాజ్యాంగ హింస. ‘‘నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేం. పార్లమెంటు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలది. అందుకు ఒక ప్రవర్తన నియమావళి వారి రూపొందించుకోవాలి. విద్వేషపూరిత వ్యాఖ్యల వల్ల పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు. నేతల విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ. సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉంది. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యం అని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.
నేపథ్యం..
యూపీ బులంద్‌షహర్‌లో ఆరేళ్ల కిందట(2016) జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నాటి యూపీ మంత్రి, ఎస్పీ నేత ఆజాం ఖాన్ స్పందిస్తూ.. ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని, అంతకుమించి ఏం లేదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆపై కోర్టు, ఖాన్‌ను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
ఇలాంటి ఘటన సమయంలో భావప్రకటన స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం తరపున బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. అలా మాట్లాడడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. సీనియర్ న్యాయవాదులు ఫాలి ఎస్ నారిమన్, హరీష్ సాల్వే రూపొందించిన ప్రశ్నల దృష్ట్యా.. 2017లో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. (క్లిక్ చేయండి: నోట్ల రద్దుపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు)
Comments
Please login to add a commentAdd a comment