సర్వే సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

సర్వే సక్సెస్‌

Published Fri, Oct 11 2024 2:04 AM | Last Updated on Fri, Oct 11 2024 2:04 AM

సర్వే సక్సెస్‌

ముగిసిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ సర్వే

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ

గురువారం నాటికి 58.44 శాతం పూర్తి

దసరాలోగా పూర్తి చేసేలా కార్యాచరణ

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ సర్వే జిల్లాలో ముగిసింది. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఈ నెల 3 నుంచి మంగళవారం వరకు కొనసాగింది. ముఖ్యంగా బేస్‌ ఫ్యామిలీ డాటా, న్యూ ఫ్యామిలీ క్రియేషన్‌ పేరిట డిజిటల్‌ సర్వే పూర్తి చేశారు. సర్వే చేపట్టిన గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా న్యూ ఫ్యామిలీ క్రియేషన్‌ విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు ఫార్మాట్లలో సమాచారం సేకరణ

ప్రతీ సర్వే బృందంలో ఐదుగురు సభ్యులను నియమించి వారి ద్వారా ఇంటింటికీ వెళ్లి ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ఖరారు చేసిన రెండు ఫార్మాట్లలో సమాచారం సేకరించారు. కుటుంబ యజమానిగా మహిళలకు పెద్దపీట వేసి, మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబ పెద్దలతో ఉన్న సంబంధం, వారి వయస్సు, పుట్టిన తేదీ, ఆధార్‌, ఫోన్‌ నంబరు వంటి పూర్తి వివరాలు సేకరించారు. ఇప్పటి దాకా వివిధ పథకాలకు ప్రత్యేకంగా కార్డులుగా రేషన్‌ కార్డు ఉండగా డిజిటల్‌ కార్డును అన్ని పథకాలకు వర్తించేలా రూపొందించనున్నారు. ఈ మేరకు పూర్తికాబడిన సర్వే తమకు పూర్తి భరోసాగా నిలుస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు.

మూడు మున్సిపల్‌ వార్డులు, మరో మూడు గ్రామాల్లో..

జిల్లాలో ఎంపిక చేసిన మూడు మున్సిపల్‌ వార్డులు, మరో మూడు గ్రామ పంచాయతీల్లో సర్వే కొనసాగింది. సర్వేకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు, సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో జరిగింది. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సర్వే కొనసాగుతున్న తీరును పర్యవేక్షించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికై నా వివాహం జరిగితే ఆ కుటుంబాన్ని వేరుగా గుర్తించి సర్వే చేశారు. అలాగే ఆడపిల్ల పెళ్లి జరిగి వెళ్లిపోతే ఆమె పేరును కుటుంబ సభ్యుల జాబితా నుంచి తొలగించారు.

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియ..

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు సర్వే మంగళవారం పూర్తి కావడంతో బుధవారం నుంచి ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీ నమోదును ప్రారంభించారు. ఈ విధానంపై ఒక్కో పైలట్‌ గ్రామానికి ఇద్దరు టీం లీడర్స్‌, ఒక ఆపరేటర్‌కు అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మీ సేవలోనే డాటా ఎంట్రీ డిజిటల్‌ ఫ్యామిలీ పేరులో సెపరేట్‌ ఫోల్డర్‌ క్రియేట్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రభుత్వ గైడ్‌లైన్‌ ప్రకారం కార్డులు పంపిణీ చేయనున్నట్టు సమాచారం.

58.44 శాతం ఆన్‌లైన్‌ పూర్తి..

జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 2,228 కుటుంబాలు సర్వే చేయగా ఈనెల 9వ తేదీ నాటికి 1,302 కుటుంబాలకు ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 58.44శాతం ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో సర్వేతో పాటు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ కూడా వందశాతం పూర్తయింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్లో నమోదు చేసిన వివరాలలో 710 పాత డేటాబేస్‌, 592 కొత్త కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. మరో 926 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది.

నియోజకవర్గాల వారీగా..

నిర్మల్‌ నియోజకవర్గంలో డ్యాంగాపూర్‌ను ఎంపిక చేశారు. అందులో 323 కుటుంబాలు ఉండగా ఆన్‌లైన్‌ పూర్తయిన కుటుంబాలు 189, కొత్త కుటుంబాలు 136 ఉన్నాయి. నిర్మల్‌ మున్సిపాలిటీలోని 42వ వార్డులో 543 కుటుంబాలు ఉండగా ఆన్‌లైన్‌ పూర్తయిన పాత కుటుంబాలు 86, కొత్త కుటుంబాలు 62 ఉన్నాయి. ముధోల్‌ నియోజకవర్గంలో హస్గుల్‌లో మొత్తం కుటుంబాలు 328 ఉన్నాయి. అందులో ఆన్‌లైన్‌ పూర్తయిన కుటుంబాలు 97, కొత్త కుటుంబాలు 231 ఉన్నాయి. భైంసా మున్సిపాలిటీలోని 24వ వార్డులో మొత్తం కుటుంబాలు 199 ఉండగా ఆన్‌లైన్‌ పూర్తయినవి 125, కొత్తవి 74 ఉన్నాయి. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని కొత్తపేటలో మొత్తం కుటుంబాలు 158 ఉండగా ఆన్‌లైన్‌ పూర్తయిన కుటుంబాలు 84, కొత్త కుటుంబాలు 74 ఉన్నాయి. మున్సిపాలిటీలోని 4వ వార్డులో 144 కుటుంబాలు ఉండగా ఆన్‌లైన్‌ పూర్తయిన కుటుంబాలు 129, కొత్త కుటుంబాలు 15 ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement