మరఠ్వాడలో మనోళ్లు..!
● ఎనిమిది నియోజకవర్గాలో కీలకం.. ● ప్రచారంలోనూ జిల్లా నేతలు ● ‘మహా’ సంగ్రామంపై స్థానికంగా ఆసక్తి
నిర్మల్: జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ.. ఇలా అన్ని పార్టీల మరాఠాలు అధికార సాధనే ఏకై క లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇలాంటి ‘మహా’పోరులో మనోళ్లు కూడా కీలకంగా ఉన్నారు. జిల్లా సరిహద్దున గల మరఠ్వాడ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మనోళ్ల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీలన్నీ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తున్నాయి. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో మకాం వేసి, సరిహద్దు ఆవల ఉన్న మరాఠా నియోజకవర్గాల్లో చక్రం తిప్పే పనిలో ఉన్నారు.
ఇక్కడ మరాఠీ.. అక్కడ తెలుగు..
నిజాం పాలన అటు రాయలసీమ ప్రాంతాల నుంచి ఇటు మహారాష్ట్ర వరకూ సాగింది. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బణి, ఔరంగాబాద్ వరకూ నిజాం పాలనలో ఉన్నాయి. మరఠ్వాడ ప్రాంతానికి కూడా సెప్టెంబర్ 17నే విముక్తి లభించింది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని భైంసా, బోథ్, భోకర్, కిన్వట్ ఏరియాల్లో పలు తెలుగు ప్రజలున్న గ్రామాలు మహారాష్ట్రలోకి, మరాఠీ మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉన్న ఊళ్లు తెలంగాణలోకి వచ్చాయి. ఈక్రమంలోనే జిల్లాలో ఉన్న సరిహద్దు గ్రామాల్లో మరాఠీ మాట్లాడితే.. మహారాష్ట్రలోని చాలా ఊళ్లల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడుతుండటం కనిపిస్తుంది.
బంధాలు – బంధుత్వాలు..
పక్కపక్కనే ఉండటం, భాషాబంధాలూ కలువడంతోపాటు బంధుత్వాలనూ బలంగానే కలిపేసుకుంటూ వస్తున్నారు. నిర్మల్ నుంచి నాందేడ్, పర్బణి, ఔరంగాబాద్ వరకూ బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆడబిడ్డలను అక్కడికి ఇస్తూ, అక్కడి నుంచి కోడళ్లను తెచ్చుకుంటున్నారు. కొన్ని కులాలు, కుటుంబాలు తరాలుగా మహారాష్ట్రలోని తమ బంధువులతోనే సంబంధాలు కలుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ధర్మాబాద్ నుంచి కారంపొడి తెచ్చుకోవడం, నాందేడ్‌లో వైద్యం చేయించుకోవడం జిల్లావాసులకు కామన్. ప్రధానంగా సారంగపూర్, కుంటాల, కుభీర్, భైంసా, తానూరు, ముధోల్, బాసర, లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్‌పూర్, నిర్మల్ మండలాల నుంచి మహారాష్ట్ర ప్రాంతాలతో బలమైన అనుబంధాలు ఉన్నాయి.
ఎనిమిది చోట్ల కీలకం..
జిల్లాతోపాటు తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని చాలాప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నారు. సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, భోకర్, కిన్వట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాతో సంబంధాలు కలిగిఉన్నవారు, అక్కడ స్థిరపడిన జిల్లావాసులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లోనూ వీరి ఓట్లే కీలకం కానున్నాయి. ఇక నర్సి, నయగావ్, నాందేడ్, దెగ్లూర్ నియోజకవర్గాల్లోనూ జిల్లా సంబంధీకుల ఓటర్లు ప్రభావితంగానే ఉన్నారు. ఇక చాలామందికి జిల్లాతోపాటు మహారాష్ట్రలోనూ ఓట్లు ఉండటం గమనార్హం. భోకర్, ధర్మబాద్ తదితర ప్రాంతాలకు చెందిన చాలా కుటుంబాలు భైంసా, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. ఇప్పటికీ వారు రెండుచోట్ల ఓట్లు వేస్తున్నారు.
ప్రచారంలోనూ..
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లేయడంలోనే కాదు.. ఓట్లను రాబట్టడంలోనూ మనవాళ్లే కీలకంగా మారారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సహా బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు సరిహద్దు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా సరిహద్దున భైంసాలో మకాం వేసి, మరాఠా నియోజకవర్గాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు చేశారు. ఇక పక్కనే ఉన్న రాష్ట్రం, అక్కడి వాళ్లతో బలమైన బంధుత్వాలు కలిగి ఉండటంతో మరాఠాపోరులో ఎవరు గెలుస్తారనే దానిపైనే జిల్లా అంతా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారమే ఉండటంతో జిల్లాలో ఉన్న మరాఠాలు ఇప్పటికే తమ సొంతప్రాంతాలకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment